Share News

CM Revanth Reddy: కాకతీయులను సమ్మక్క, సారక్కలను చంపిన రాజులుగనే చూస్త...

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:18 AM

‘‘సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయ రాజులను నేను చూస్తా. పన్నులు చెల్లించబోం అని అన్నందుకు ఆ గిరిజన యోధులపై దాడి చేసి హతమార్చారు. రుద్రమదేవి హయాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంతులు కాపాడారు. ప్రతాపరుద్రుడు వచ్చాక పద్మనాయకులను చేరదీశాడు. వారు చేయివ్వడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy: కాకతీయులను సమ్మక్క, సారక్కలను చంపిన రాజులుగనే చూస్త...

  • కళాతోరణం ఉంటదా ఉండదా అన్నది ప్రజలే నిర్ణయిస్తరు

  • ప్రభుత్వ చిహ్నం, విగ్రహంపై అసెంబ్లీలో చర్చకు పెడతం

  • రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై కేసీఆర్‌కు గౌరవమే లేదు..

  • తెలంగాణ గేయం రూపకల్పన పూర్తి బాధ్యత అందెశ్రీదే

  • డిమాండ్‌తోనే బీర్లకు కొరత.. విత్తనాల లోటు లేనే లేదు

  • లోక్‌సభ ఫలితాలు వంద రోజుల పాలనకు రెఫరెండమే!

  • 9-12 ఎంపీ సీట్లు, కంటోన్మెంట్‌, ఎమ్మెల్సీ గెలుస్తం

  • తెలంగాణలో బీజేపీకి 4-5 సీట్లేనని నడ్డానే చెప్పిండు

  • కేసీఆర్‌ కోసమే ట్యాపింగ్‌ కేసు బీజేపీ సీబీఐకివ్వాలంటోంది

  • వేడుకలకు సోనియా రాకపోతే వీడియో సందేశం

  • మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ‘‘సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయ రాజులను నేను చూస్తా. పన్నులు చెల్లించబోం అని అన్నందుకు ఆ గిరిజన యోధులపై దాడి చేసి హతమార్చారు. రుద్రమదేవి హయాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంతులు కాపాడారు. ప్రతాపరుద్రుడు వచ్చాక పద్మనాయకులను చేరదీశాడు. వారు చేయివ్వడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం సారనాథ్‌ స్థూపం నుంచి అశోక చక్రాన్ని స్వీకరించిందని.. ఇది ధర్మాన్ని చాటుతుందని పేర్కొన్నారు. తెలంగాణ చిహ్నం మార్పునకు కేంద్రం అనుమతి తీసుకుంటాం అని చెప్పారు. ‘‘రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కళాకారులు కొన్ని నమూనాలిచ్చారు. వాటిపై చర్చలు జరుగుతున్నాయి.


చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చకు పెడతాం. చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండేదీ, లేనిదీ ప్రజలే నిర్ణయిస్తారు. సూచనలు, అభ్యంతరాలుంటే బీఆర్‌ఎస్‌ నేతలు ప్రభుత్వానికి నివేదించవచ్చు’’ అని అన్నారు. శనివారం తన నివాసంలో మీడియాతో సీఎం రేవంత్‌ చిట్‌చాట్‌గా మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ తనకు దక్కిన జీవితకాలపు అవకాశమని సీఎం అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నేతృత్వంలో వీటిని నిర్వహించడం, అందరినీ భాగస్వాములు చేయడం అదృష్టమన్నారు. అమరుల స్థూపాన్ని రూ.వెయ్యి కోట్లతో కట్టాలని మొదట డిమాండ్‌ చేసింది తానేనన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే కేసీఆర్‌కు కనీస గౌరవం లేదని రేవంత్‌ మండిపడ్డారు. భారత్‌ కంటే ఒక రోజు ముందు పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొన్నట్లు.. రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందు కేసీఆర్‌ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారని ఎద్దేవా చేశారు. దశాబ్ది వేడులకు రాని ఆయన అసెంబ్లీకి వస్తారంటే ఎవరు నమ్ముతారని అన్నారు. అమర వీరులన్నా, అమరుల స్థూపం అన్నా కేసీఆర్‌కు ఎందుకంత ద్వేషమని ప్రశ్నించారు. అమరుల స్థూపం వద్దకు వెళ్లేందుకు, పరేడ్‌ గ్రౌండ్‌, ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాలకు, సోనియాగాంధీని ఆహ్వానించేందుకూ ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నట్లు సీఎం తెలిపారు.


నిబంధనలు కేసీఆర్‌, కేటీఆర్‌కు వేరేలా ఉంటాయా? అని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో కేసీఆరే ఉండాలి.. ఆయన గురించే చర్చించాలా? అని నిలదీశారు. జయ జయహే తెలంగాణ గేయం రూపకల్పన బాధ్యతను దానిని రాసిన, పాడిన అందెశ్రీకే అప్పగించామని సీఎం స్పష్టం చేశారు. సంగీత దర్శకుడు మొదలు మొత్తం బృందాన్ని ఆయనే ఎంచుకున్నారని చెప్పారు. ఆ గీతం.. బృందగానంతో సాగుతుందని, వాయిద్యకారుల్లో బెంగాలీలు, మలయాళీలూ ఉండొచ్చనని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలన్న కొందరు నేతల డిమాండ్‌పై స్పందిస్తూ.. రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లకే ఏపీ ప్రభుత్వం వారికి సంబంధించినవన్నీ తెలంగాణకు అప్పగించేసి వెళ్లిపోయిందన్నారు.


ఇక ఆ చర్చే లేదని, అలాంటిది కావాల్సింది కేసీఆర్‌, కేటీఆర్‌కేనని వ్యాఖ్యానించారు. దశాబ్ది వేడుకలకు రావాలంటూ కేసీఆర్‌తో పాటు అన్ని పార్టీల అధినేతలనూ ఆహ్వానించామని సీఎం తెలిపారు. కానీ, తెలంగాణను వ్యాపార వస్తువుగా చేసుకుని ఇంకా లాభం పొందాలని కేసీఆర్‌ చూస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చి పార్టీలో తెలంగాణను లేకుండా చేసుకుంది కేసీఆరేనన్నారు. కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ.. కేసీఆర్‌ను కాపాడేందుకు బీజేపీ నేతలు తాపత్రయపడుతున్నారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. రాష్ట్ర పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని హితవు పలికారు. కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే ఫోన్‌ ట్యాప్‌ అయిందని ఆరోపించారని, అప్పుడే ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు.


అమరవీరులను గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేస్తాం

తెలంగాణ అమరులను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌ తెలిపారు. గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నామని, పోలీస్‌ స్టేషన్ల నుంచి ఎఫ్‌ఐఆర్‌లూ తెప్పించి.. పరిశీలిస్తామని చెప్పారు. బీజేపీ వాళ్లు చెప్పినవవి చేయడానికి తమ పార్టీ వారి అనుబంధ సంస్థ కాదని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి ఓట్లడిగాయని, ప్రజలు వారికి ఇవ్వాల్సింది ఇచ్చారన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం కోసం శంకుస్థాపన చేసిన స్థలంలో తాము తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నామని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ కాంపౌండ్‌ లోపలే ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. విగ్రహం రూపకల్పన బాధ్యతను ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌కు అప్పగించినట్లు తెలిపారు.


డిమాండ్‌ పెరగడం వల్లనే బీర్లకు కొరత

డిమాండ్‌ పెరగడం వల్లనే రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడిందని సీఎం చెప్పారు. కొత్త బ్రాండ్లపైన స్పందిస్తూ దారిన పోయే ఏ బ్రాండ్‌ అయినా బెవరేజెస్‌ కార్పొరేషన్‌ గోదాంలో స్టాక్‌ పెట్టుకోవచ్చని, అమ్ముడుపోయినవాటికి కార్పొరేషన్‌.. పైసలు కట్టిస్తదన్నారు. ఒక్క సంస్థకు చెందినవి తప్ప రాష్ట్రంలో విత్తనాలకు కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. ఆ సంస్థ ఇప్పటికే మొత్తం కేటాయించేసిందని, ఇంకా కావాలంటే సమయం పడుతుందన్నారు. ఆదిలాబాద్‌లోనే సమస్య ఉందని, మహారాష్ట్ర రైతులు వచ్చి విత్తనాలు తీసుకెళ్తుండడమే దీనికి కారణమని పేర్కొన్నారు. పంద్రాగస్టు కల్లా రుణమాఫీ అమలు చేస్తామని సీఎం మరోసారి చెప్పారు. లే అవుట్‌ చేసిన భూములు, రోడ్లు, టాటా బిర్లాలకు కూడా రైతు బంధు ఇచ్చారని కేసీఆర్‌ను తప్పుబట్టారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలన్నదానిపై అసెంబ్లీలో చర్చ పెడతామని స్పష్టం చేశారు.


కాళేశ్వరంపై కేసీఆర్‌ 3 నెలలు ఏం చేశారు?

కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి ఏజెన్సీలు ఇచ్చే నివేదికలను బట్టి చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. కేసీఆర్‌ ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిందని.. మూడు నెలల్లో ఎందుకు మరమ్మతులు చేయించలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ తన మేధావితనంతో ఎన్డీఎ్‌సఏకు నివేదిక ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్‌, గంజాయి నిరోధంపై స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్నది విద్యుత్తు అంతరాయాలే కానీ.. కోతలు కాదని రేవంత్‌ స్పష్టం చేశారు. ఏ సబ్‌స్టేషన్‌కైనా వెళ్లి ఐదు నెలల లాగ్‌బుక్‌లు తీద్దామని, కోతలా? అంతరాయాలా? అన్నది పరిశీలన చేద్దామని బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. తీవ్ర ఎండలు, కరువు పరిస్థితులతో నీళ్లు లేక విద్యుత్తు వాడకం తీవ్రంగా పెరిగిందని, ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్‌ ఎక్కువై ట్రిప్‌ అవడం, కాలిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. కాగా, నయీమ్‌ కేసుకు సంబంధించి ఇంకా చర్చే జరగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలిచ్చామన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాము ఇచ్చిన 30 వేల ఉద్యోగాలతో జాబితాను విడుదల చేస్తామని, బీఆర్‌ఎస్‌ జాబితాను విడుదల చేయాలని సవాల్‌ విసిరారు. టీ శాట్‌ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్‌ క్లాసులు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఉపాధ్యాయుడు అందుబాటు లేని స్కూళ్లలో ఇది ఉపయోగంగా మారుతుందన్నారు.


రెఫరెండమే.. కేంద్రంలో ఇండియానే

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమ వంద రోజుల పాలనకు రెఫరెండమేనని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, కంటోన్మెంట్‌లోనూ గెలుస్తామన్నారు. ఆశించిన ఫలితం రాకుంటే ఏం చేస్తారనగా.. ప్రస్తుతం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నామని, ఇకపై మరో రెండు గంటలు అదనంగా పనిచేస్తానన్నారు. కాంగ్రె్‌సకు 9 నుంచి 12 సీట్లు వస్తాయని, బీజేపీకి 4 నుంచి 5 సీట్లు వస్తాయంటూ ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డానే ట్వీట్‌ చేశారన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి వస్తుందని, కీలకమైన మంత్రి పదువులు తీసుకుని రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకుంటామని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ తర్వాతనే రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు.


ఆవిర్భావ వేడుకలకు సోనియా రావట్లేదా!

ఆమె రావడమో.. సందేశాన్ని పంపడమో.. ఏదో ఒకటి జరుగుతుందన్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కావడంలేదా? ఆవిడ పంపిన సందేశాన్నే చదివి వినిపించనున్నారా? సీఎం రేవంత్‌రెడ్డి శనివారం తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ.. చెప్పిన మాటలు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిర్వహించే సభకు సోనియాగాంధీ రావాలని, సన్మానాన్ని స్వీకరించాలని తాను కోరుకుంటున్నానని, అయితే ఆమె రావడమో.. లేక సందేశాన్ని పంపడమో ఏదో ఒకటే జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీని ఆవిర్భావ వేడుకల సందర్భంగా సన్మానించాలని రాష్ట్ర క్యాబినెట్‌ తీర్మానించడం, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆమెను ఆహ్వానించడం తెలిసిందే. వచ్చేందుకు ఆమె అంగీకారాన్నీ తెలిపారు. అయితే ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆవిర్భావ వేడకలకు వెళ్లకపోవడం శ్రేయస్కరమంటూ డాక్టర్లు సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆదివారంనాటి కార్యక్రమానికి ఆమె హాజరవుతుందా.. లేదా? అన్నది డైలమాలో పడింది.

Updated Date - Jun 02 , 2024 | 04:18 AM