High Court: ‘రేవంత్’ కేసుపై అర్ధరాత్రి విచారణ!
ABN , Publish Date - May 25 , 2024 | 03:26 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన ఓ ప్రైవేటు ఫిర్యాదును దిగువకోర్టు స్వీకరించకుండా వాయిదా వేయడాన్ని అత్యవసరంగా విచారించాలంటూ బీజేపీ రాష్ట్రశాఖ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది.
అర్ధరాత్రి ఒంటిగంటకు హైకోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి ముందుకు
షా ఫేక్ వీడియోపై సీఎంకు వ్యతిరేకంగా నాంపల్లి కోర్టులో బీజేపీ రాష్ట్ర శాఖ ఫిర్యాదు
స్వీకరించకుండా వాయిదా... సవాలు చేస్తూ అత్యవసర విచారణ కోసం హైకోర్టుకు
అవసరం లేదని వెకేషన్ బెంచ్ వ్యాఖ్య
జూన్ 4వ తేదీకి కేసు వాయిదా
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన ఓ ప్రైవేటు ఫిర్యాదును దిగువకోర్టు స్వీకరించకుండా వాయిదా వేయడాన్ని అత్యవసరంగా విచారించాలంటూ బీజేపీ రాష్ట్రశాఖ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ అమిత్ షా చెబుతున్నట్లుగా ఓ ఫేక్ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 299, 300 ప్రకారం ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేయడంతో అత్యవసరంగా విచారణ చేపట్టేలా ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర శాఖ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దిగువకోర్టు ఆదేశాలను కొట్టేయడంతోపాటు ప్రైవేట్ కంప్లైంట్‌ను విచారణకు స్వీకరించేలా ఆదేశించాలని కోరారు.
దీన్ని హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. ఈ మేరకు వెకేషన్ బెంచ్ సీనియర్ జడ్జి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి అర్ధరాత్రి ఒంటి గంటకు విచారణ నిర్వహించారు. సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్‌లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి ఒంటిగంట అయింది. అయితే బీజేపీ రాష్ట్ర శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏమిటో తెలుసుకుని చెప్పాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు పిటిషనర్ తరఫున న్యాయవాది హంస దేవినేని వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసి 45 రోజులవుతోందని.. చట్టప్రకారం ఇలాంటి ఫిర్యాదులపై రోజువారీ విచారణ చేపట్టాల్సి ఉండగా మేజిస్ట్రేట్ సుదీర్ఘ కాలం వాయిదా వేశారని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజుకీ రెచ్చగొట్టే ప్రసంగాలు కొనసాగిస్తున్నారని.. అవన్నీ సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమ ఫిర్యాదును జూలై 3 వరకు వాయిదా వేయడాన్ని కొట్టేసి అత్యవసరంగా విచారణ చేపట్టేలా దిగువ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ.. దిగువ కోర్టు ప్రైవేటు ఫిర్యాదును కేవలం వాయిదా మాత్రమే వేసిందని.. దానిపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం చెల్లదని పేర్కొన్నారు. అర్ధరాత్రి విచారించాల్సినంత అత్యవసర విషయం కాదని.. ఈ పిటిషన్‌లో ప్రభుత్వ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని పేర్కొన్నారు. పూర్తివివరాలు తెలుసుకునే వరకు సమయం ఇవ్వాలని.. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసు కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇందులో అంత అతస్యవసరం ఏముంది? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.