Share News

CM Revanth Reddy: అత్యధిక స్థానాలు మావే!

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:28 AM

ఎగ్జిట్‌ పోల్‌ నివేదికలు ఎలా ఉన్నా.. రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను కాంగ్రెస్సే దక్కించుకుంటుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో 14 శాతంగా ఉన్న మైనారిటీ ఓటర్లలో అత్యధికులు కాంగ్రెస్‌ అభ్యర్థులకే మద్దతుగా నిలిచారని చెబుతున్నాయి.

CM Revanth Reddy: అత్యధిక స్థానాలు మావే!

  • రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు: సోనియా

  • బీజేపీకి బీఆర్‌ఎస్‌ ఓట్లబదిలీపై అస్పష్టత

  • గట్టిపోటీ ఉన్నచోట్ల బదిలీతో ఇబ్బందేనన్న అభిప్రాయం

  • కౌంటింగ్‌ లో అప్రమత్తంగా ఉండాలి

  • కాంగ్రెస్‌ అభ్యర్థులతో సీఎం రేవంత్‌రెడ్డి

    కేంద్రంలో మళ్లీ కమల వికాసమా? లేక హస్తవాసినా? మూడోసారీ మోదీనా..? రాహుల్‌ శకం రానుందా?

    400 సీట్లు దాటేస్తామంటున్న ఎన్డీఏ..! గ్యారెంటీగా మెజారిటీ మార్క్‌ను చేరుతామంటున్న ఇండియా..!

    ఏ కూటమిదో గెలుపు తీరం! తెలంగాణలో పైచేయి కాంగ్రెస్‌దా..? కాషాయ దళానిదా..? గులాబీ గుబాళిస్తుందా..? ఏపీని వచ్చే ఐదేళ్లు ఏలేదెవరు..? టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సూపర్‌ హిట్‌ కొట్టనుందా..? విజయం వైసీపీని వరించనుందా?

    ఉత్కళ నేల ఒడిసాలో ఉత్కంఠ తప్పదా..? ఈ ప్రశ్నలన్నింటికీ తెరదించుతూ.. 81 రోజుల ప్రక్రియ..

    46 రోజుల క్రతువుకు ముగింపు పలుకుతూ.. 21 రోజుల నిరీక్షణకు వీడ్కోలు చెబుతూ.. జూన్‌ 4 రానే వచ్చింది..! దేశవ్యాప్తంగా ప్రజల తీర్పు తేలేది నేడే..!

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఎగ్జిట్‌ పోల్‌ నివేదికలు ఎలా ఉన్నా.. రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను కాంగ్రెస్సే దక్కించుకుంటుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో 14 శాతంగా ఉన్న మైనారిటీ ఓటర్లలో అత్యధికులు కాంగ్రెస్‌ అభ్యర్థులకే మద్దతుగా నిలిచారని చెబుతున్నాయి. ఒకటి, రెండు శాతం ఓట్లే గెలుపోటములను నిర్ణయించే పరిస్థితులున్న నేపథ్యంలో మైనారిటీ ఓటర్ల మద్దతు తమకు సానుకూలాంశమని అంటున్నాయి. తమ ప్రభుత్వం అమలు చేసిన ఐదు గ్యారెంటీలతో మహిళలకు కూడా తమకే మద్దతు తెలిపారని పేర్కొంటున్నాయి.


కాంగ్రె్‌సకు 9 నుంచి 12 సీట్లు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని, కానీ.. ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించే స్థాయిలో మాత్రం పెరగదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ ఓట్లు ఏ మేరకు చీలాయన్న దానిపైనే కాంగ్రెస్‌ పెద్దలు పూర్తిగా అంచనాకు రాలేకపోతున్నారు. కాంగ్రె్‌సకు బీజేపీ పోటీ ఇస్తున్న నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు పెద్ద ఎత్తున ఆ పార్టీకి మళ్లాయన్న అంచనాలే వారిని కలవరపెడుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఓట్లు చీలితే బీజేపీకి ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని గ్రహించే.. త్రిముఖ పోటీ ఉండేలా సీఎం రేవంత్‌రెడ్డి మొదటినుంచీ తన ప్రచారంలో కేసీఆర్‌ను, ఆ పార్టీని టార్గెట్‌ చేసుకుని మాట్లాడారని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.


బీజేపీకి బీఆర్‌ఎస్‌ ఓట్ల బదిలీ తక్కువే!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరాశలో కూరుకుపోవడం, పార్టీ ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి రావడంతో కేసీఆర్‌ సైతం విస్తృతంగా ప్రచారంలో పాల్గొని ఓటుబ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేశారని కాంగ్రెస్‌ వర్గాలు గుర్తు చేస్తున్నారు. దీంతో బయట ప్రచారం జరుగుతున్న స్థాయిలో బీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకు బీజేపీకి బదిలీ కాలేదని వారు అంచనా వేస్తున్నాయి. బీజేపీ గట్టి పోటీ ఇస్తున్న చోట్ల మాత్రం కొంతమేరకు బదిలీ అయిందని అంటున్నారు. కానీ, అలాంటి చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులకు కూడా బీఆర్‌ఎస్‌ ఓట్లు కొంతమేరకు బదిలీ అయ్యాయంటున్నారు. భావజాలం పరంగా బీజేపీ గెలవడం ఇష్టంలేని బీఆర్‌ఎస్‌ సానుభూతిపరుల్లో ఈ మేరకు ఓట్ల బదిలీ జరిగిందని అంచనా వేస్తున్నారు. మైనారిటీ ఓటర్ల మద్దతు, రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడం, పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగా ఉండే వ్యతిరేకత, ప్రచారం జరిగిన మేరకు బీఆర్‌ఎస్‌ ఓట్లు చీలే అవకాశం లేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మెజారిటీ సీట్లను కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుంటుందన్న అంచనాలో ఉన్నారు. కనీసం 9 సీట్లు, కలిసివస్తే 12 సీట్లు దక్కించుకుంటామని చెబుతున్నారు.


ఇండియా కూటమి గెలుపుపై ఆశలు..!

జాతీయ స్థాయిలో ఇండియా కూటమి గెలుపుపై టీ కాంగ్రెస్‌ నేతలు ఆశలు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగానూ మైనారిటీలు మద్దతుగా ఉండడం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారెంటీలు కలిసివచ్చి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద అండ దొరుకుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మెడపై రైతు రుణమాఫీ పెద్ద భారంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు నిరుద్యోగ భృతి, పెన్షన్లు తదితర హామీలూ ఎదురు చూస్తున్నాయి. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంపై రైతు రుణమాఫీ భారం తప్పుతుందని చెబుతున్నారు. కూటమి అమలు చేసే పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారెంటీల్లో రైతు రుణమాఫీ సహా రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉన్న పలు హామీలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.


అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్‌

ఓట్ల లెక్కింపు సమయంలో పార్టీ అభ్యర్థులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రత్యేకించి పోటా పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. సోమవారం కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థులు, ఇన్‌చార్జి మంత్రులతో జూమ్‌ ద్వారా సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్‌గా పంపాలన్నారు. సీనియర్‌ నాయకులనూ కౌంటింగ్‌ సెంటర్లకు తీసుకెళ్లాలని, ప్రతి రౌండ్‌ కౌంటింగ్‌ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరి దగ్గరా 17-సి లిస్టు ఉండేలా చూసుకోవాలని, ఈ లిస్టులోని ఓట్లకు, ఈవీఎం ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ కూడా పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 03:40 AM