Congress Ministers : అధైర్య పడకండి.. అండగా ఉంటాం
ABN , Publish Date - Sep 04 , 2024 | 03:42 AM
భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మంగళవారం పర్యటించారు. బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
వరద బాధితులకు మంత్రుల భరోసా.. దెబ్బతిన్న ప్రాంతాలు, పంటల పరిశీలన
నిత్యావసర సరుకుల పంపిణీకి భట్టి ఆదేశం
ఇళ్లు కోల్పోయినవారికి పరిహారం అందిస్తాం
ప్రాజెక్టుల రక్షణకు సబ్ కమిటీ: ఉత్తమ్
ప్రతిపక్ష నేత ఎక్కడ?: మహేశ్‌కుమార్ గౌడ్
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబరు 3: భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మంగళవారం పర్యటించారు. బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పరిశీలించారు. పండ్రేగుపల్లి మున్నేరు కరకట్ట తెగి డబుల్ బెడ్‌రూం ఇళ్లలోకి నీరు రాగా అక్కడి పరిస్థితిని పరిశీలించి బాధితులకు మనోధైర్యం చెప్పారు.
తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.10 వేలు సాయం అందిస్తామన్నారు. చెరువులు, కుంటలు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేయడంతో వరద నీరు భారీగా రోడ్లపైకి వచ్చిందన్నారు. హుజూర్‌నగర్ ట్యాంక్‌బండ్ డిజైన్‌ను ఇష్టానుసారంగా మార్చి ఇళ్లలోకి వరద రావడానికి కారణమైన నీటి పారుదల శాఖ ఏఈ తుమ్మల శ్రీనివా్‌సను సస్పెండ్ చేయాలని సీఈ రమేశ్‌బాబును ఆదేశించారు.
ప్రాజెక్టుల రక్షణకు సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మఠంపల్లిలోని మామిళ్లచెరువును పరిశీలించేందుకు ఉత్తమ్... రైతులతో కలిసి 5 కిలోమీటర్లు ట్రాక్టర్‌పై వెళ్లారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో కలిసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు.ప్రాజెక్టు పనులు పూర్తికావడంతో త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లిలో నీటమునిగిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు.
గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను పరామర్శించారు. కేసీఆర్ ఫాంహౌ్‌సలో, కేటీఆర్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలను జనాలు తిరగబడి చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు 24 గంటలూ కృషి చేస్తున్నా కేటీఆర్, హరీశ్‌రావు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
బీజేపీ నిజస్వరూపం బయటపడింది: వీహెచ్
కులగణన కేవలం ఉద్యోగ నియామకాలకే కానీ రాజకీయాలకు ఉపయోగించుకూడదన్న ఆర్‌ఎ్‌సఎస్ ప్రకటనతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. బీసీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలా అంటూ నిలదీశారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లు సమాధానం చెప్పాలన్నారు.