Kaleshwaram Project: బీఆర్‌ఎస్ నేతలకు అవగాహన లేదు..
ABN , Publish Date - Aug 06 , 2024 | 02:38 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీరు నిల్వ చేయవద్దంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) స్పష్టం చేసిన సంగతి బీఆర్‌ఎస్ నేతలకు తెలియదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రశ్నించారు.
కాళేశ్వరంలో నీరు నిల్వ వద్దన్నది ఎన్‌డీఎ్‌సఏనే: విజయరమణారావు
కులగణన బిల్లు పెట్టాలి: వీహెచ్
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీరు నిల్వ చేయవద్దంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) స్పష్టం చేసిన సంగతి బీఆర్‌ఎస్ నేతలకు తెలియదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రశ్నించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్.. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. సోమవారం సీఎల్పీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ.. రూ.లక్ష కోట్లు అడ్డంగా దోచి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయిందన్నారు. ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచిన బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
కాగా, పార్లమెంట్‌లో బీసీ కుల గణన బిల్లు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. బీసీ కులానికి చెందిన వ్యక్తి ప్రధాని అయ్యారని నిర్మలా సీతారామన్ చెబుతున్నారని, కానీ బీసీలకు పదేళ్లుగా ఆయన చేసిందేమీ లేదన్నారు. దేశంలో కులగణన జరగాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్‌పై నమ్మకం లేకనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు.
వారిని ఆపేందుకు కేటీఆర్, హరీశ్‌రావులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వు వస్తోందని వ్యాఖ్యానించారు. ‘ఆనాడు టీడీఎల్పీని, సీఎల్పీని బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసుకున్నప్పుడు కేసీఆర్, కేటీఆర్‌కు సిగ్గనిపించలేదా? రాజకీయాల్లో వారికొక న్యాయం.. ఇతరులకు ఓ న్యాయమా?’’అని నిలదీశారు. కేసీఆర్ అవినీతి వల్లనే ప్రజలపై అప్పుల భారం పడిందని టీపీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయం అన్నారు.