PCC President: నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత!
ABN , Publish Date - Aug 24 , 2024 | 02:55 AM
తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసింది.
రాష్ట్ర అగ్రనేతలకు వెల్లడించిన పార్టీ అధిష్ఠానం
న్యూఢిల్లీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసింది. మంత్రివర్గ జాబితాపై కూడా ఆ నేతలతో కసరత్తు జరిపిన అధిష్ఠానం.. సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్ఠానంతో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.
శుక్రవారం మధ్యాహ్నం వారితో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ వేర్వేరుగా చర్చలు జరిపారు. తొలుత రేవంత్‌ను, తర్వాత భట్టిని, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి.. పీసీసీ అధ్యక్షుడిపై వారి అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చాల్సిన నేతల వివరాలను కూడా సేకరించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి, ప్రజలకిచ్చిన హామీలపై వస్తున్న ప్రతిస్పందనలు, బీజేపీ, బీఆర్ ఎస్ కార్యకలాపాల గురించి వివరంగా చర్చించారు.
రేవంత్ దాదాపు 40 నిమిషాలపాటు వారితో మాట్లాడగా.. భట్టి, ఉత్తమ్ చెరి 15-20 నిమిషాల పాటు తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి తెలిపారు. అనంతరం.. రేవంత్, భట్టి, ఉత్తమ్‌తో కేసీ వేణుగోపాల్ కొద్దిసేపు చర్చించారు. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ ఎన్నికల అభ్యర్థులపై సీఈసీ భేటీ, కర్ణాటక నేతలతో సమావేశం జరగడంతో వేణుగోపాల్ వారిని రాత్రి 8 గంటల ప్రాంతంలో తన నివాసానికి పిలిచారు. మరోమారు ఆ ముగ్గురు నేతలతో 40 నిమిషాలసేపు మాట్లాడారు. ఆ సమయంలో ముగ్గురు నేతలూ కలిసికట్టుగా తమ అభిప్రాయాలను ఆయనకు వివరించారు.
ముగ్గురూ.. బీసీల నుంచి మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ పేర్లను, ఎస్టీల నుంచి బలరాం నాయక్ పేరును ఎస్సీల నుంచి సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ పేర్లను చెప్పినట్లు తెలిసింది. కాగా బీసీల నుంచే పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయని.. వారిలో మహేశ్ కుమార్ గౌడ్‌కు అధిష్ఠానం ప్రాధాన్యం ఇవ్వొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతిమ నిర్ణయం అధిష్ఠానానిదే అని రేవంత్, భట్టి, ఉత్తమ్ తేల్చిచెప్పారు. అలాగే.. మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం నలుగురికే అవకాశం ఉన్నదనే చర్చ జరుగుతోంది.
విస్తరణ రేసులో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, ప్రేమసాగర్ రావు, బాలూ నాయక్, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాంచందర్ నాయక్, మల్ రె డ్డి రంగారెడ్డి తదితరుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఏదేమైనా శ్రావణమాసంలోనే పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.