Share News

Hyderabad: ‘తగ్గేదేలా!

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:46 AM

పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సంద ర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట, మహిళ మృతిపై ఎవరి వాదనలు వారు చెబుతున్నారు.

Hyderabad: ‘తగ్గేదేలా!

  • ముదురుతున్న తొక్కిసలాట వివాదం

పుష్ప-2 ప్రీమియర్‌ షో రోజు సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది! ఆ సినిమాలోని ‘తగ్గేదేలా’ అన్న డైలాగ్‌ తరహాలో ఇరు వర్గాల మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి! ఆరోజు జరిగిన ఘటనల క్రమాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి వివరించడం.. దానిని ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్‌ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది! ‘ఓ మహిళ చనిపోయింది.. థియేటర్‌ నుంచి వెళ్లిపోవాలి’ అంటూ పోలీసులు తనకు చెప్పలేదని అర్జున్‌ చెప్పడం వివాదాస్పదమైంది! దాంతో, పోలీసులు ఆదివారం స్పందించారు. ఆరోజు జరిగిన ఘటనల తాలూకు వీడియోలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు! అల్లు అర్జున్‌ను థియేటర్‌ నుంచి ఏసీపీ, డీసీపీ బయటకు తీసుకువస్తున్న వీడియోను విడుదల చేశారు!

నిర్లక్ష్యానికి సాక్ష్యాలివిగో!

  • అల్లు అర్జున్‌ను థియేటర్‌కు రానివ్వొద్దని ఆదేశిస్తూ

  • సీఐ లేఖ.. అయినా పట్టించుకోని యాజమాన్యం

  • మహిళ చనిపోయిందన్నా స్పందించని అర్జున్‌

  • డీసీపీ వచ్చిన తర్వాత బయటకొచ్చారు

  • సంధ్య థియేటర్‌ ఘటనపై ప్రజెంటేషన్‌ ఇచ్చిన

  • హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సంద ర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట, మహిళ మృతిపై ఎవరి వాదనలు వారు చెబుతున్నారు. థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిందని, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, థియేటర్‌ నుంచి వెళ్లిపోవాలని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు వెళ్లి అల్లు అర్జున్‌కి చెప్పినా ఆయన అక్కడి నుంచి వెళ్లలేదని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. చివరికి పోలీసు ఉన్నతాధికారులే వెళ్లి ఆయ న్ను బయటకు తీసుకెళ్లాల్సి వచ్చిందన్నారు. అలాగే ఆయన వెళ్లిపోయేటప్పుడు కూడా కారు రూఫ్‌ నుంచి బయటకు వచ్చి చేతులు ఊపారని సీఎం వెల్లడించారు. కానీ, అల్లు అర్జున్‌ మాత్రం తనకు థియేటర్‌ వద్ద మహిళ చనిపోయిన సంగతి ఎవరూ చెప్పలేదని మీడియా సమావేశంలో తెలిపారు. మహిళ మరణించిన విషయం మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తనకు తెలిసిందన్నారు. తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, వ్యక్తిత్వ హననం చేస్తున్నారనీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్‌ వద్ద అసలేం జరిగిందనే దానిపై ఆదివారం వీడియోల తో సహా ‘మినిట్‌ టు మినిట్‌’ వివరాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మీడియాకు చూపారు. ఆ రోజు రాత్రి 9 నుంచి 12 గంటల వరకు జరిగిన ఘటనలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుష్ప-2 ప్రీమియర్‌ షో చూడడానికి అల్లు అర్జున్‌ థియేటర్‌కు రావద్దని పోలీసులు స్పష్టంగా చెప్పారన్నారు. ఆయన రాకకు అనుమతి ఇవ్వలేదని.. ఈ విషయాన్ని థియేటర్‌ యాజమాన్యం అర్జున్‌కు చెప్పారో, లేదో తమకు తెలియదని అన్నారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయపరమైన సలహాలు తీసుకొని ముందుకెళ్తామని తెలిపారు.

12.jpg


బౌన్సర్ల భరతం పడతాం

ప్రస్తుతం సంధ్య థియేటర్‌ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనని సీపీ ఆనంద్‌ అన్నారు. అయితే వీఐపీలు, వీవీఐపీల వద్ద ఉండే బౌ న్సర్లు, బౌన్సర్లను సరఫరా చేసే ఏజెన్సీలను హెచ్చరించారు. జనాన్ని అడ్డగోలుగా తోసేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. బౌన్సర్లను పెట్టుకున్న వారిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను తోసినా, వారిపై చెయ్యి వేసినా వదిలిపెట్టబో మన్నారు. సంధ్య థియేటర్‌లో పోలీసులను బౌన్సర్లు తోసేసినట్లు వీడియో ఫుటేజీలు ఉన్నాయన్నారు.


10 వేల కెమెరాల ఫుటేజీని పరిశీలించాం

‘సంధ్య థియేటర్‌ ఘటనపై అనేక రకాల వాదనలు వచ్చాయి. మా సోషల్‌ మీడియా బృందం శోధన చేసింది. అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌, అసెంబ్లీలో జరిగిన చర్చపైనా మేం స్పందించాం. దాదాపు వారం రోజులుగా 10 వేల కెమెరాలు, చాలా మంది ప్రజలు తమ సెల్‌ఫోన్లలోనూ వీడియోలు తీశారు. అక్కడ ఉన్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, మీడియా చానెళ్ల ద్వారా వచ్చిన బైట్స్‌ను పరిశీలించాం. అన్నింటినీ క్రోడీకరించి పది నిమిషాల వీడియోను రూపొందించాం’ అని సీపీ వివరించారు.

  • ఈ నెల 2న సాయంత్రం 5.35 గంటలకు సంధ్య థియేటర్‌ మేనేజర్‌ నాగరాజు ఏసీపీ కార్యాలయంలో దరఖాస్తు అందజేసి, ఆ తర్వాత ఎస్‌హెచ్‌వోకి ఇచ్చారు. 3న థియేటర్‌ను సందర్శించిన ఎస్‌హెచ్‌వో.. అల్లు అర్జున్‌, చిత్ర బృందం వస్తే జనం గుమిగూడే పరిస్థితి వస్తుందని భావించారు. చిత్ర బృందాన్ని రానివ్వొద్దని ఆదేశిస్తూ 4న థియేటర్‌ యాజమాన్యానికి లెటర్‌ ఇచ్చారు. ఆ పత్రాలను పీపీటీలో చూపించారు.


ఆ రోజు జరిగింది ఇదీ..

  • ఈ నెల 4న రాత్రి 9.15 గంటలకు అల్లు అర్జున్‌ మామ, కూతురు ఫార్చ్యూనర్‌ కారులో థియేటర్‌ లోపలికి వచ్చారు. (వీడియో చూపారు)

  • ఆ తర్వాత అల్లు అర్జున్‌ కారు లోపలికి వచ్చేందుకు గేట్‌ తెరవడంతో జనం ఒక్కసారిగా లోపలికి వచ్చారు. దీంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. (పోలీసులు వీడియో చూపారు)

  • ఆ తర్వాత నల్లరంగు స్కార్పియో కారులో అల్లు అర్జున్‌ కొడుకు వచ్చాడు. (వీడియో ఉంది)

  • రాత్రి 9.25 గంటల తర్వాత రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ థియేటర్‌ గేటు నుంచి లోపలికి వచ్చారు. (వీడియో ఉంది)

  • సుమారు రాత్రి 9.28 నుంచి 9.34 గంటల సమయంలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని మెట్రో స్టేషన్‌, సంధ్య థియేటర్‌ వరకు కార్‌ సన్‌రూఫ్‌ నుంచి బయటకు వ చ్చిన అల్లు అర్జున్‌ అక్కడి ప్రజలకు చేతులు ఊపుతూ, అభివాదం చేస్తూ ర్యాలీగా వచ్చారు. జన సమూహం సంధ్య థియేటర్‌ వైపు కదిలింది. (వీడియో చూపారు)

  • 9.35 సమయంలో దాదాపు ప్రైవేట్‌ సెక్యూరిటీ (బౌన్సర్లు) 40-50 మంది థియేటర్‌ మెయిన్‌ గేట్‌ లోపలికి ప్రవేశించారు. (వీడియో ఉంది)

  • 9.35-9.40 మధ్య లోయర్‌ బాల్కనీకి వెళ్లే గ్రిల్‌ గేట్‌ మార్గంలో జనం పెరగడంతో గేట్‌ విరిగి తొక్కిసలాటకు దారి తీసింది. (వీడియో ఉంది)

  • 9.40 సమయంలో అర్జున్‌ బౌన్సర్లు అప్పర్‌ బాల్కనీకి వెళ్లే మార్గాన్ని అధీనంలోకి తీసుకొని ఆయ న్ని పైకి తీసుకెళ్లారు. (వీడియో ఉంది)

  • పెద్దఎత్తున ప్రేక్షకులు రావడంతో లోయర్‌ బాల్కనీ నిండిపోయింది. ఆ సమయంలో అదే ప్రాంతం లో ఉన్న రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ సృహ కోల్పోయారు. (అక్కడి వీడియో చూపలేదు). అల్లు అర్జున్‌ అప్పర్‌ బాల్కనీకి చేరడంతో అతన్ని చూసేందుకు కొందరు లోయర్‌ బాల్కనీ నుంచి పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. (వీడియో చూపారు)

  • సుమారు 9.45-9.50 మధ్య అపస్మారక స్థితికి చేరిన రేవతి, శ్రీతేజలను గుర్తించిన పోలీసులు, జనం.. థియేటర్‌ బయటకు తీసుకొచ్చారు. వారికి పోలీసులు సీపీఆర్‌ చేసిఆస్పత్రికి తరలించారు.(వీడియో ఉంది)

  • 10.45 గంటల సమయంలో ఏసీపీ ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చాక.. థియేటర్‌ బయట పరిస్థితి, రేవతి చనిపోయిన విషయం, ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితిపై అర్జున్‌కి తెలియజేయడానికి అనేకసార్లు ప్రయత్నించినా ఆయన మేనేజర్‌ సంతోష్‌ అడ్డుపడ్డాడు. తాను తెలియజేస్తానని చెప్పాడు. అర్జున్‌ని తీసుకెళ్లాలని అతనికి చెప్పారు. (వీడియో లేదు)

  • సుమారు రాత్రి 11.45 వరకు మేనేజర్‌ అర్జున్‌ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. దీంతో ఏసీపీ నేరుగా అల్లు అర్జున్‌ దగ్గరకు వెళ్లి రేవతి, శ్రీతేజల పరిస్థితి, బయట రద్దీ ఉన్న జనం గురించి చెప్పి వెళ్లిపోవాలని సూచించారు. కానీ, అల్లు అర్జున్‌ తాను సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని చెప్పారు. దీంతో సీరియస్‌ అయిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ.. అర్జున్‌ను తీసుకొని వెళ్లాలని అతని మేనేజర్‌కు గట్టిగా చెప్పారు. మేనేజర్‌ పది నిమిషాలు సమయం అడగ్గా, పోలీసులు ఆలోపు థియేటర్‌ రూట్‌ క్లియర్‌ చేశారు. (వీడియో లేదని, వెతుకుతున్నామని చెప్పారు)

  • రాత్రి 12.05 గంటల సమయంలో డీసీపీ థియేటర్‌ లోపలికి వెళ్లి అల్లు అర్జున్‌ని బయటకు తీసుకొచ్చారు. థియేటర్‌ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలోనూ కారు సన్‌రూ్‌ఫ నుంచి పైకి వచ్చిన అర్జున్‌.. మళ్లీ చేతులు ఊపుతూ, అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆ సమయంలోనూ థియేటర్‌ ఎదురుగా రోడ్లపై విపరీతమైన రద్దీ నెలకొంది. (వీడియో ఉంది)


సినిమా చూశాకే వెళ్తానన్నారు: ఏసీపీ

అల్లు అర్జున్‌ మేనేజర్‌ సంతోష్‌ దగ్గరకెళ్లి తొక్కిసలాట విషయం చెప్పామని చిక్కడపల్లి ఏసీపీ రమేష్‌ కుమార్‌ తెలిపారు. ‘మీరు థియేటర్‌కు వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగింది. దానివల్ల ఒక మహిళ చనిపోగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని చెప్పామన్నారు. మేనేజర్‌ తమను అల్లు అర్జున్‌ వద్దకు వెళ్లనివ్వలేదని చెప్పారు. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి అల్లు అర్జున్‌కు విషయం చెప్పామని, అయినా సినిమా చూసిన తర్వా తే వెళ్తామని ఆయన చెప్పారని వెల్లడించారు. డీసీసీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్‌ను థియేటర్‌ లోపలి నుంచి బయటకు తీసుకొచ్చినట్లు వివరించారు.


15 రోజులుగా మనశ్శాంతి లేదు

‘తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చాలా భాధాకరం. 15 రోజుల నుంచి దీని గురించే బాధ పడుతున్నా. మనఃశాంతి లేదు’ అంటూ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ సీఐ రాజునాయక్‌ కన్నీటిపర్యంతమయ్యారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయాన్న బాధ ఉందన్నారు. తన చేతుల్లోనే ఆమె ప్రాణం పోయిందని వాపోయారు. తనకు ఇచ్చిన లేఖలోనే ప్రీమియర్‌ షోకు చిత్ర బృందం రావద్దని ఆదేశిస్తూ థియేటర్‌ యాజమాన్యానికి తెలియజేశానన్నారు.


సినిమా ప్రమోషన్‌ కాదు.. పౌరుల భద్రతే ముఖ్యం

  • మేం ఎవరికీ వ్యతిరేకం కాదు: డీజీపీ

    12.jpg

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్‌ ముఖ్యం కాదని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అల్లు అర్జున్‌ సినిమా హీరో అయినప్పటికీ బయట సామాన్యుడేనని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకొని మసలుకోవాలని చెప్పారు. వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పౌరుల భద్రత చాలా ముఖ్యమన్నారు. సంధ్య థియేటర్‌ ఘటన దురదృష్టకరమని, చట్ట ప్రకారం అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సినీ నటుడు మంచు మోహన్‌బాబుది కుటుంబ గొడవని, వారు కొంత మారారని చెప్పారు. జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై కేసు నమోదు చేశామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో నక్సలిజం లేదని చెప్పలేదని, ఇటీవల రాష్ట్ర సరిహద్దులో ఇద్దరిని ఇన్‌ఫార్మర్ల పేరిట చంపేశారని పేర్కొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 03:46 AM