Share News

Hyderabad: జోరుగా నకిలీ మందుల దందా..

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:20 AM

తెలంగాణలో నకిలీ, నాసిరకం ఔషధాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉత్తుత్తి మందులను అమ్ముతూ కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికారులు చేస్తున్న దాడుల్లో నకిలీ మందుల ముఠాలు భారీగా బయటపడుతున్నాయి.

Hyderabad: జోరుగా నకిలీ మందుల దందా..

  • ప్రజారోగ్యంతో కేటుగాళ్ల చెలగాటం

  • ఉత్తరాది నుంచి రాష్ట్రానికి సరఫరా

  • దాడుల్లో పట్టుబడుతున్న ముఠాలు

  • కోట్ల విలువైన ఔషధాలు స్వాధీనం

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నకిలీ, నాసిరకం ఔషధాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉత్తుత్తి మందులను అమ్ముతూ కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికారులు చేస్తున్న దాడుల్లో నకిలీ మందుల ముఠాలు భారీగా బయటపడుతున్నాయి. కొందరు కేటుగాళ్లు మార్కెట్‌లో పేరున్న కంపెనీల బ్రాండ్లతో నకిలీ ఔషధాలను తయారు చేస్తున్నారు. ఇటువంటి ఔషధాల్లో అసలు మందే ఉండటం లేదు. అలాగే కొన్నిసార్లు అసలు మందుకు బదులు వేరే ఔషధాన్ని నింపుతున్నారు. కొద్ది రోజుల కిందట ఔషధ నియంత్రణ అఽధికారుల దాడుల్లో ఓ కంపెనీకి చెందిన అమోక్సిలిన్‌ బదులు పారాసిటమాల్‌ ఉంచి విక్రయిస్తున్నట్లు బయటపడింది. అలాగే ఔషధాల తయారీలో వినియోగించే రసాయనాలను సమపాళ్లలో కలపడం లేదు.


ఇటువంటి ఔషధాలతో ఆరోగ్యం మరింత దెబ్బతింటోంది. రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అధికారులు ఇటీవల పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో నాణ్యత లేనివి, నకిలీ మందులు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఘజియాబాద్‌, ఖాసీపూర్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు నకిలీ ఔషధాలు వస్తున్నాయి. గతేడాది డిసెంబరు నుంచి ఇప్పటిదాకా రూ.కోట్ల విలువైన నకిలీ ఔషధాలను డీసీఏ అధికారులు పట్టుకున్నారు.


నకిలీ మందులను ఇలా గుర్తించండి..

గతంలో ఒక మెడిసిన్‌ను వాడి ఉన్నట్లు అయితే.. ప్రస్తుతం మెడికల్‌ షాపులో తెచ్చిన మందుపై ఏమైనా అనుమానం ఉంటే.. మొదట వాడిన మెడిసిన్‌ స్ట్రిప్‌తో పోల్చి చూడాలి. అలాగే స్పెల్లింగ్‌ కూడా ఒకటి, రెండు అక్షరాలతో అసలు కంపెనీని పోలి ఉండేలా నకిలీవి ఉంటున్నాయి. కేంద్రం ఔషధాలకు సంబంధించి 300 బ్రాండ్‌ మెడిసిన్‌ను నోటిఫై చేసి, వాటికి బార్‌, క్యూఆర్‌ కోడ్‌ను ఇచ్చింది. ఆ బ్రాండ్స్‌ జాబితాను రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి వెబ్‌సైట్‌లో ఉంచింది. ముందులతో అనారోగ్య సమస్యలు, అలర్జీ, ఇతర దుష్ప్రభావాలు కనిపిస్తే వాటిని అనుమానించాలి. ఇంటర్నెట్‌ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి మందులను కొనొద్దు. లైసెన్స్‌ పొందిన మెడికల్‌ షాపుల నుంచే ఔషధాలు కొనాలి.


సర్కారు సీరియస్‌ ..

నకిలీ, నాసిరకం ఔషధాలపై సర్కారు సీరియ్‌సగా ఉంది. 2015 నుంచి 2022 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు 24,781 నమూనాలను సేకరించారు. ఇందులో 24,532 శాంపిల్స్‌ నాణ్యమైనవిగా తేలింది. 249 ఔషధాలు నాణ్యత లేనివిగా గుర్తించారు. 2023లో రాష్ట్రవ్యాప్తంగా 4,127 ఔషధ నమూనాలను సేకరించారు. అందులో 78 నాణ్యత లేనివి, 59 మిస్‌ బ్రాండెండ్‌ ఉన్నాయి. టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ సరాఫరా చేస్తున్న ఔషధాల్లో కూడా పది నమూనాలు నాణ్యతా పరీక్షలో ఫెయిలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 పోలీసు కేసులను నమోదు చేశారు. నకిలీ మందుల విషయం పౌరులకు తెలిస్తే ఔషధ నియంత్రణ మండలి టోల్‌ ఫ్రీ నంబరు 18005996969కు కాల్‌ చేయవచ్చు.


రాష్ట్రంలో ఫార్మా రంగం స్థూలంగా ఇలా..

బల్క్‌ డ్రగ్‌ యూనిట్స్‌- 183; ఫార్ములేషన్స్‌ యూనిట్స్‌- 159; హ్యూమన్‌ వ్యాక్సినేషన్స్‌ తయారీ యూనిట్స్‌ 10; మెడికల్‌ డివైజ్‌ యూనిట్స్‌-35; ఇన్‌విట్రో డయాగ్నస్టిక్స్‌- 8; డ్రగ్‌ పెల్లెట్స్‌-47; ఆర్‌-డీఎన్‌ఏ డిరైవ్డ్‌ డ్రగ్స్‌-5; బ్లడ్‌ ప్రొడక్ట్స్‌ యూనిట్స్‌-3; కాస్మెటిక్స్‌- 25; వెటర్నరీ వ్యాక్సిన్స్‌,డి్‌సఇన్ఫెక్ట్స్‌, శానిటైజర్స్‌, మెడికల్‌ గ్యాస్‌ యూనిట్స్‌ ఇతరత్రా కలిపి-224; మొత్తం యూనిట్ల సంఖ్య -702; రిటైల్‌, హోల్‌సేల్‌ మెడికల్‌ షాపులు- 43,023.

Updated Date - Jun 17 , 2024 | 04:21 AM