Share News

Yadagirigutta: యాదగిరికొండపై భక్తుల రద్దీ..

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:10 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.

Yadagirigutta: యాదగిరికొండపై భక్తుల రద్దీ..

  • నేడు గిరిప్రదక్షిణ, వన మహోత్సవం

భువనగిరి అర్బన్‌, జూలై 14: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ టికెట్‌ దర్శనానికి గంట సమయం, ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.45,68,806 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ఇదిలా ఉండగా, అఖండ దీపారాధనకు, భక్తులు కొబ్బరికాయలు సమర్పించేందుకు ఒకేచోట అధికారులు శాశ్వత ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు రాజగోపురం ఎదురుగా ధర్మ దర్శనం గోల్డెన్‌ క్యూలైన్‌లో ఇదివరకే కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేయగా, ప్రత్యేక దర్శనం టికెట్‌ తీసుకుని వెళ్లే భక్తులకు అవకాశం ఉండేది కాదు.


దీనిపై విమర్శలు రావడంతో తిరుమల తరహాలో అఖండ దీపారాధన, కొబ్బరికాయలు కొట్టేందుకు ఈశాన్య దిశలో ప్రత్యేక నిర్మాణం మొదలుపెట్టారు. వర్షం కురిస్తే భక్తులు ఇబ్బంది పడుతుండటంతో తూర్పు, త్రితల రాజగోపురాల నడుమ షెడ్డు ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం జరిగే గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమై కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్లు కొనసాగుతుంది. ప్రతి నెలా గిరి ప్రదక్షిణ చేపడుతున్నారు. గత నెల 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. సోమవారం నిర్వహించనున్న వన మహోత్సవంలో రెండు వేల మొక్కలు నాటేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 15 , 2024 | 04:10 AM