Share News

Police Assault: పోలీసులపై కత్తులు, కర్రలతో దాడి..

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:32 AM

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దొంగలు గొడ్డలి, రాళ్లతో పోలీసులపై దాడి చేసిన మరుసటి రోజే సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నార్సింగ్‌ పోలీసులపై రౌడీ మూకలు కత్తులు, హాకీ కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

Police Assault: పోలీసులపై కత్తులు, కర్రలతో దాడి..

  • రూ. 25 కోట్ల స్థల వివాదంలో ఎమ్మార్పీఎస్‌ నేత కిడ్నాప్‌

  • అక్కడికి వెళ్లిన పోలీసులపై దుండగుల దాడి... నలుగురి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ/నార్సింగ్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దొంగలు గొడ్డలి, రాళ్లతో పోలీసులపై దాడి చేసిన మరుసటి రోజే సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నార్సింగ్‌ పోలీసులపై రౌడీ మూకలు కత్తులు, హాకీ కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు వెంటనే అదనపు బలగాలను రప్పించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నార్సింగ్‌ పరిధిలోని బృందావన్‌ కాలనీలో శనివారం వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఎమ్మార్పీఎస్‌ నాయకుడు నరేందర్‌ కోసం నార్సింగ్‌ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన్ను ఎవరో కిడ్నాప్‌ చేశారని తెలియడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు.


ఈ క్రమంలో నరేందర్‌ గండిపేట బృందావన్‌ కాలనీలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఓ ఖాళీ జాగాలో అలజడిగా ఉండటంతో.. పోలీసులు వెళ్లి అక్కడ ఉన్న వారిని ప్రశ్నించారు. నరేందర్‌ను వారు అక్కడే దాచిపెట్టినట్లు పోలీసులకు అర్థమైంది. ‘ఈ సైట్‌ ఎవరిది.? ఇక్కడ మీరు ఎందుకు ఉన్నారు..?’ అని గట్టిగా అడగడంతో గుంపుగా ఉన్న రౌడీలు ఒక్కసారిగా పోలీసుల పైకి కత్తులు, హాకీ కర్రలతో తిరగబడ్డారు. పోలీసుల పైకి కుక్కలను వదలండి అంటూ రెచ్చిపోయారు. ఎదురుదాడిని ఊహించని పోలీసులు భయబ్రాంతులకు గురయ్యారు.


వెంటనే అప్రమత్తమై అదనపు బలగాలను రప్పించారు. దాంతో వారిని చూసి రౌడీలు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటపడిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. రూ.25కోట్ల విలువ చేసే స్థలం వద్ద తిష్ట వేసి హల్‌చల్‌ సృష్టిస్తున్నట్లు తేలింది. అరెస్టు అయిన నలుగురు రౌడీషీటర్లు అహ్మద్‌ ఖాన్‌, షేక్‌ హమ్దన్‌, మహ్మద్‌ జాఫర్‌, హామద్‌ మసూద్‌ను రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు.వారికి 7 రోజుల రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఎట్టకేలకు వారి చెరలో ఉన్న నరేందర్‌ను కాపాడటంతో ఎమ్మార్పీఎస్‌ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. రూ.25 కోట్ల స్థల వివాదంలో భాగంగానే నరేందర్‌ను రౌడీలు కిడ్నాప్‌ చేశారని గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 14 , 2024 | 04:32 AM