G. Kishan Reddy: సుంకిశాలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలి
ABN , Publish Date - Aug 11 , 2024 | 04:22 AM
సుంకిశాల ప్రాజెక్టు ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని, ప్రాజెక్టులోని రక్షణ గోడ ఎందుకు ఽకూలిందో, లోపం ఎక్కడ జరిగిందో తేల్చాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రక్షణ గోడ ఎందుకు కూలిందో తేల్చాలి.. ఇళ్ల కోసం ప్రతిపాదనలను రాష్ట్రం పంపలేదు
డిప్యూటీ సీఎంతో మాట్లాడాను.. ఆలస్యమైనా అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరా
వర్గీకరణపై సుప్రీం ఆదేశాలివ్వలేదు.. ఆలోచించమని చెప్పింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సుంకిశాల ప్రాజెక్టు ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని, ప్రాజెక్టులోని రక్షణ గోడ ఎందుకు ఽకూలిందో, లోపం ఎక్కడ జరిగిందో తేల్చాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘ఏక్ పేడ్ మాకే నామ్’లో భాగంగా శనివారం ఢిల్లీలోని తన నివాసంలో మాతృమూర్తి పేరిట కిషన్ రెడ్డి ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితంలో అమ్మ తర్వాతే అన్నీ అని, కాబట్టి అమ్మకు గుర్తుగా ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు.
అమ్మ మనల్ని పెంచి పెద్దచేసినట్టే మనం కూడా మొక్కను అంతే జాగ్రత్తగా పెంచి పెద్దది చేయాలన్నారు. రోజురోజుకూ ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అడవులు తగ్గిపోతున్న తరుణంలో భవిష్యత్తు పెను సవాల్‌గా మారుతోందన్నారు. ఆ తర్వాత విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానాలు చెప్పారు. ‘అప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక అసమానతలను దృష్టిలో పెట్టుకుని దళిత వర్గానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారు.
అంతేతప్ప ఆర్థిక అసమానతల కారణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదు. దేశంలో నేటికీ దళితులపై సామాజిక వివక్ష కొనసాగుతూనే ఉంది. అయినా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆలోచించమని మాత్రమే చెప్పింది తప్ప ఆదేశాలేమీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ క్రీమీలేయర్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడున్న విధానమే కొనసాగుతుంద’ని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర కట్టుబడి ఉందన్నారు. ‘దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఇళ్లు మంజూరు చేసింది. కానీ గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతోంది. కానీ నేటికీ కేంద్రానికి ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదు. నిన్నే ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి శ్రీనివాసరెడ్డితో మాట్లాడాను. ఇళ్లకు సంబంధించి తెలంగాణ నుంచి ప్రతిపాదనలు రాలేదని, వెంటనే పంపించాలని సూచించాను. నిన్నటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలోనూ ప్రధానికి విషయం చెప్పాను. తెలంగాణ నుంచి ప్రతిపాదనలు కాస్త అలస్యంగా వచ్చినా అనుమతి ఇవ్వాలని కోరాను. ఆయన తప్పకుండా అనుమతి ఇస్తామని హామీ ఇచ్చార’ని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు విషయం అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పునకు సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్ విలీనం వార్తలను మీడియాలోనే చూశానని, ఇప్పటివరకు అటువంటి చర్చలేమీ జరగలేదన్నారు.