Share News

Harish Rao: ఏది అబద్ధం?

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:16 AM

‘‘మేం చెబుతున్నదాంట్లో ఏది అబద్ధం? కాంగ్రెస్‌ 9 నెలల పాలనలో పంచాయతీలకు 9 పైసలు కూడా ఇవ్వలేదని చెప్పడమా? కేంద్రం విడుదల చేసిన నిధులు ప్రభుత్వం దారి మళ్లించడమా?’’

Harish Rao: ఏది అబద్ధం?

  • పంచాయతీలకు కేంద్రమిచ్చిన నిధులు మళ్లించడమా?

  • 9నెలల పాలనల్లో 9పైనలు కూడా ఇవ్వకపోవడమా?

  • మంత్రి సీతక్కను ప్రశ్నించిన హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు8 (ఆంధ్రజ్యోతి): ‘‘మేం చెబుతున్నదాంట్లో ఏది అబద్ధం? కాంగ్రెస్‌ 9 నెలల పాలనలో పంచాయతీలకు 9 పైసలు కూడా ఇవ్వలేదని చెప్పడమా? కేంద్రం విడుదల చేసిన నిధులు ప్రభుత్వం దారి మళ్లించడమా?’’ అంటూ మంత్రి సీతక్కను మాజీమంత్రి తన్నీరు హరీశ్‌ రావు ప్రశ్నించారు. మేం అబద్థం చెబుతున్నామని మంత్రి సీతక్క పేర్కొనడం తగదని, ఈ ప్రభుత్వం వాస్తవాలు గుర్తించి.. సమస్యలు పరిష్కరించకపోగా ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుధ్య నిర్వహణ కష్టంగా మారిందని ఉన్నమాటంటే ఉలికిపాటు ఎందుకు? అని గురువారం ఒక ప్రకటనలో ఆయన నిలదీశారు.


పారిశుధ్య లోపం కారణంగా గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలి.. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. పంచాయతీ కార్మికులకు రెండునెలల జీతాలివ్వాలి.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు 8నెలల గౌరవ వేతనాలివ్వలేదు. మాజీ సర్పంచ్‌లు పెండింగ్‌ బిల్లులకోసం చలో సచివాలయానికి పిలుపునిస్తే ప్రభుత్వం వారిని పోలీస్‌ ేస్టషన్లలో నిర్బంధించిందని ఆరోపించారు. ఉపాధిహామీ, హెల్త్‌ మిషన్‌వంటి పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన రూ.2100 కోట్లు గ్రామాలకు ఇవ్వకుండా ప్రభుత్వం దారిమళ్లించిందని, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.500 కోట్లను పంచాయతీలకు ఇవ్వకుండా ఆపలేదా? మంత్రి సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 09 , 2024 | 04:16 AM