Share News

Godavari river: ఉగ్ర గోదావరి

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:44 AM

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నది ప్రవాహం 50.6 అడుగులకు చేరడంతో సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ వద్ద ఏకంగా 9 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలానికి భారీ వరద వస్తోంది.

Godavari river: ఉగ్ర గోదావరి

8.jpg

  • భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. 50.6 అడుగులకు నీరు

  • ప్రాణహిత ఉధృతి.. ముంపులో గ్రామాలు.. మేడిగడ్డకు 9.5 లక్షల క్యూసెక్కులు

  • జూరాల సహా తుంగభద్ర నుంచీ శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కుల వరద!

  • మరో 3 రోజులూ వర్షాలు.. కలెక్టర్లూ అప్రమత్తం.. సమీక్షలో సీఎస్‌ ఆదేశం

  • ఏపీలోని రాజమహేంద్రవరం వద్ద సముద్రాన్ని తలపిస్తున్న గోదావరి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నది ప్రవాహం 50.6 అడుగులకు చేరడంతో సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ వద్ద ఏకంగా 9 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలానికి భారీ వరద వస్తోంది. జూరాలతోపాటు తుంగభద్ర నుంచీ నీటిని విడుదల చేయడంతో సుమారుగా 2లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా.. పలు వాగులు, వంకలు ఇంకా ఉప్పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కల్వర్టులు, రోడ్లు కొట్టుకుపోగా.. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరోవైపు.. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. భద్రాచలం వద్ద నాలుగు రోజులుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన ప్రవాహం.. సోమవారం అర్ధరాత్రి వరకు 50.6 అడుగులకు చేరింది.


ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతుండడంతో మంగళవారం తుది ప్రమాద హెచ్చరిక (53 అడుగులు) దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరం ఉధృతితొ దేవస్థానానికి సంబంధించిన స్నానఘట్టాల వద్ద ఉన్న కల్యాణ కట్ట కింది భాగం పూర్తిగా మునిగిపోయింది. ముంపు బారిన పడే అవకాశం ఉందన్న అంచనాతో 111 గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేసింది. తుది ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే.. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, భద్రాచలం వద్ద కరకట్టను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం భద్రాచలం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, గతంలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. సోమవారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన వరద సాయంత్రానికి 9.36 లక్షల క్యూసెక్కులకు చేరింది. బ్యారేజీలో 85 గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు పంపిస్తున్నారు. బ్యారేజీ వద్ద 9 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది. ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్‌ బ్యారేజీ వద్ద 10,15,170 క్యూసెక్కుల వరద నమోదైంది.


  • ఆల్మట్టి, నారాయణపూర్‌కు భారీగా వరద

కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. జూరాల ప్రాజెక్టుకు 1,69,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా... 37 గేట్లను ఎత్తి 1,45,410, జల విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 29,307 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,74,717క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్రకు 1.02 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా.. మూడు గేట్లు ఎత్తి 16వేల క్యూసెక్కులను వదులుతున్నారు. రెండూ కలిపి శ్రీశైలం జలాశయానికి 1.90లక్షల క్యూసెక్కులపైగా వరద వస్తోంది.


  • పంటలకు నష్టం..

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సోమవారం మోస్తరు వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 9.7, భద్రాద్రి జిల్లాలోని పినపాక, దుమ్ముగూడెంలో 9.2, కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్‌లో 7.14, పెద్దపల్లి జిల్లాలోని ముత్తారంలో 7, నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారంలో 4.9, మంచిర్యాల జిల్లా నన్పూర్‌లో 4.34, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌తో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం, జనగామ, సూపాక, ఆల్గామ, సిర్సా గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు నీట మునిగాయి. శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పలు చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. అందవెల్లి వంతెన అప్రోచ్‌ రోడ్డు కోతకు గురికాగా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 15 మండలాల్లోని మూడు వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. వర్షాలతో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో 1.60లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలంలో లోలెవల్‌ కాజ్‌వే నీట మునగడంతో వైద్య సిబ్బంది నాటు పడవలో వెళ్లి జాజులపేటలో వైద్య శిబిరం నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి సోమవారం 3,180 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వపై ఇప్పటికే బుంగ పడగా, తాజాగా కాల్వ కట్ట కోతకు గురవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాల్వ కట్ట కింద భాగంలో 20రోజుల కిందటే బుంగ పడింది. నీటి ప్రవాహం కొనసాగుతుండగానే కాల్వ కట్ట కోతకు గురవటంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. మెదక్‌ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి 1270క్యూసెక్కుల వరద వస్తోంది.


  • తల్లీ, బిడ్డను వాగు దాటించిన పోలీసులు

మావోయిస్టుల వేటలో నిమగ్నమైన పోలీసు బలగాలు ఓ బాలింతకు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా నంబి గ్రామానికి చెందిన మాద్వి జాగి అనే మహిళ నెలలు నిండకుండానే ప్రసవించింది. దాంతో పుట్టిన బిడ్డకు అనారోగ్య సమస్య ఏర్పడింది. తల్లి, బిడ్డను వైద్యం కోసం పక్కనే ఉన్న ఊసూరుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా నంబి వాగును దాటలేకపోయారు. ఈ విషయం అక్కడ విధుల్లో ఉన్న బలగాలకు తెలియడంతో.. రెండు డ్రమ్ములపై తడిక వేసి, దానిపై బాలింతను, బిడ్డను కూర్చోబెట్టి వాగు దాటించారు. చికిత్స అనంతరం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలోని ఆర్లపెంటకు చెందిన రవ్వా దేవా అనారోగ్యంతో ఇటంపాడులో మరణించగా.. అతడి కుటుంబ సభ్యులు జడ్డీపై మృతదేహాన్ని ఉంచి 20కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు.


  • హెలికాప్టర్‌లో కూంబింగ్‌ బలగాల తరలింపు

  • ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని ఎలిమిడి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఈనెల 19న ఎన్‌కౌంటర్‌ జరగ్గా, తిరిగి వచ్చే క్రమంలో వాగులు దాటలేక దండకారణ్యంలో చిక్కుకుపోయిన ఇందులో 130 మంది పోలీసులును ప్రత్యేక హెలికాప్టర్‌లో తరలించారు. వారం రోజులుగా దండకారణ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసుల కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఎనిమిది రోజుల క్రితం వంద మంది కూంబింగ్‌కు వెళ్లగా వారికి ఆహారం, మందులను అందించేందుకు మూడు రోజుల క్రితం మరో 30 మంది పోలీసులు వెళ్లారు. మొత్తం 130 మంది పోలీసులను పెనుగోలు గుట్టల నుంచి వాజేడు మండలంలోని మండపాకకు తరలించారు. కొందరు నడవలేని స్థితిలో ఉండటంతో హెలికాప్టర్‌ నుంచి బస్సు వరకు మోసుకుంటూ తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం వారిని వరంగల్‌కు తీసుకెళ్లారని సమాచారం.


  • ఎలాంటి నష్టం జరగొద్దు: సీఎస్‌

రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ శాంతి కుమారి ఆదేశించారు. డీజీపీ జితేందర్‌తో కలిసి కలెక్టర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు, పునరావాస కేంద్రాలనును ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కాగా, వరదల విపత్తును సమర్థంగా ఎదుర్కొంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రస్తుత ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో

సామర్థ్యం సామర్థ్యం

ఆల్మట్టి 129.72 97.23 1,15,406 1,44,295

నారాయణపూర్‌ 37.64 32.14 1,45,000 1,44,250

తుంగభద్ర 100.86 87.42 1,02,000 16,000

జూరాల 9.66 7.65 1,69,000 1,74,717

శ్రీశైలం 15.81 52.15 1,90,717 0

నాగార్జునసాగర్‌ 215 122.68 0 9,378

సింగూరు 9.91 13.70 1270 391

శ్రీరాంసాగర్‌ 80.5 21.37 20,023 518

కడెం 7.6 5.52 6,224 3,316

ఎల్లంపల్లి 20.18 10.56 24,433 331

అన్నారం 10.87 0.08 17200 17,200

మేడిగడ్డ 16.17 2.15 9,54,310 9,54,310

సమ్మక్క 6.94 3.81 10,15,170 10,15,170

సీతమ్మ 36.57 0.2 11,86,801 11,86,801

Updated Date - Jul 23 , 2024 | 03:44 AM