Share News

High Court Notice: ‘కోకాపేటలో 11ఎకరాల’పై వివరణ ఇవ్వండి

ABN , Publish Date - Jul 25 , 2024 | 03:32 AM

కోకాపేటలో గత ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది.

High Court Notice: ‘కోకాపేటలో 11ఎకరాల’పై వివరణ ఇవ్వండి

  • బీఆర్‌ఎ్‌సకు హైకోర్టు నోటీసులు

  • వైఖరి తెలపాలని ప్రభుత్వానికీ ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కోకాపేటలో గత ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది. అలాగే ఈ వ్యవహారంపై ప్రభుత్వ వైఖరి ఏంటో తెలియజేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. గత ప్రభుత్వం తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. కోకాపేటలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన 11 ఎకరాల భూమిని అప్పటి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి కట్టబెట్టిందని పేర్కొంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.


రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో సర్వే నంబరు 239, 240లో 11 ఎకరాల (53,240 చదరపు గజాలు) భూమిని 2023 మే 23న బీఆర్‌ఎస్‌ పార్టీకి కేటాయిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ భూమిపై యాజమాన్య హక్కులు తమకే ఉన్నాయని.. వివాదాస్పద భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి టైటిల్‌ లేకుండానే బీఆర్‌ఎస్‌ పార్టీకి కేటాయించడం అక్రమమని పేర్కొంటూ సికింద్రాబాద్‌ హైదర్‌బస్తీకి చెందిన జాకేటి అశోక్‌దత్‌ జయశ్రీ, కనుకాల జ్యోతిర్మయి దత్‌, జేఏ కీర్తిమయి, జేఏ అక్షయ్‌దత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది.

Updated Date - Jul 25 , 2024 | 03:32 AM