Share News

Hyderabad : గ్రామీణ వైద్యులకు బంపర్‌ ఆఫర్‌

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:59 AM

వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు రేవంత్‌ సర్కారు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల వేతనాలు భారీగా పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Hyderabad : గ్రామీణ వైద్యులకు బంపర్‌ ఆఫర్‌

  • బేసిక్‌పై 70% మేర పెంపునకు సర్కారు యోచన

  • పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏహెచ్‌ ఆస్పత్రుల పెంపు

  • నిర్ణీత దూరాల్లో ఆస్పత్రులు ఉండేలా చర్యలు

  • 4 చోట్ల కొత్తగా మొబైల్‌ కేన్సర్‌ పరీక్షా కేంద్రాలు

  • విప్లవాత్మక సంస్కరణలు: దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు రేవంత్‌ సర్కారు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల వేతనాలు భారీగా పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. మూల వేతనంపై 70 శాతం మేరకు జీతాలు పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖలో 50 శాతానికిపైగా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నారు.

అయితే వేతనాలు తక్కువగా ఉండటం వల్ల చాలామంది పల్లె ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తిచూపట్లేదు. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 636, పట్టణ ప్రాంతాల్లో 232 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో పల్లె ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సుమారు 400 ఎంబీబీఎస్‌ రెగ్యులర్‌ డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆ ఖాళీలను భర్తీ చేయాలంటే వేతనపెంపు ఒక్కటే మార్గమని సర్కారు భావిస్తోంది. పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులకు ప్రస్తుతం మూలవేతనం రూ.58,850 వేలుగా ఉంది. దీన్ని 70 శాతం మేర పెంచి ఈ సమస్యను పరిష్కరించాలని అభిప్రాయపడుతోంది.


తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ పరిఽధిలోని సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వారి వేతనాలను కూడా ఇదేస్థాయిలో పెంచే అవకాశాలున్నాయి. ఇక.. మెడికల్‌ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో పనిచేసే అధ్యాపకుల వేతనపెంపు ఫైల్‌ ఆర్థికశాఖ వద్ద ఉంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి మూలవేతనంపై 50 శాతం, మిగతా ప్రాంతాల్లో అయితే 30 శాతం పెంచాలన్న ప్రతిపాదనలున్నాయి. ఇందులో హైదరాబాద్‌ను మినహాయించారు. దీనిపై కూడా త్వరలోనే స్పష్టత వస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో ఆస్పత్రుల ఏర్పాటు ప్రస్తుతానికి ఒక దశదిశ లేకుండా ఉంది. గతంలో రాజకీయ పలుకుబడి ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ) ప్రాంతీయ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఇవన్నీ భారతీయ ప్రజారోగ్య ప్రమాణాలకు అనుగుణంగా లేవు. ఒకచోట ఈ ఆస్పత్రులు దగ్గరదగ్గరగా ఉంటే.. మరోచోట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల మధ్య కనీస దూరం తగ్గించే చర్యలను ప్రభుత్వం తీసుకోబోతుంది. సుమారు ప్రతి 15 కిలోమీటర్లకూ ఒక పీహెచ్‌సీ, దానికి 15 కిలోమీటర్ల దూరంలో సీహెచ్‌సీలు, ఆ తర్వాత ఏరియా ఆస్పత్రులుండేలా చర్యలు తీసుకోబోతోంది. అలాగే జనాభా ప్రాతిపదికతో పాటు ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ ఆధారంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల సంఖ్యను పెంచబోతుంది.


  • క్యాన్సర్‌పై పోరు..

రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. క్యాన్సర్‌ నిర్ధారణ సరిగా జరగక.. చాలా కేసుల్లో చివరిదశలో గుర్తించడం వల్ల జరగకూడని నష్టం జరుగుతోంది. అందుకే క్యాన్సర్‌ పరీక్షలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలోనే పూర్తిస్థాయి రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. కొత్తగా నాలుగు మొబైల్‌ క్యాన్సర్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.

సంగారెడ్డి, నిజామాబాద్‌లతో పాటు మరో రెండు చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. అలాగే క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలకయ్యే వ్యయాన్ని జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధుల నుంచి వెచ్చించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jul 31 , 2024 | 06:01 AM