Share News

అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. ఆయన డైరెక్షన్‌లోనే బన్నీ నడుస్తున్నారంటున్న కాంగ్రెస్..

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:17 PM

పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తోపులాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ పేరు ప్రస్తావించకుండానే అల్లు అర్జున్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.. డైరెక్షన్‌లోనే బన్నీ నడుస్తున్నారని..

అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. ఆయన డైరెక్షన్‌లోనే బన్నీ నడుస్తున్నారంటున్న కాంగ్రెస్..
Allu Arjun

పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తోపులాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఘటనలో నటుడు అల్లు అర్జున్‌ను నిందితుడిగా పేర్కొన్నారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా, ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తాజాగా సంధ్యా థియేటర్ తోపులాట ఘటనపై అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో పాటు సినీ పరిశ్రమ సంధ్యా థియేటర్ ఘటన వ్యవహారంలో బాధ్యాతరహిత్యంగా వ్యవహరించిందన్నారు. ఓ మహిళ మృతి చెందిందనే విషయాన్ని అల్లు అర్జున్‌కి చెప్పినా ఆయన కనీసం స్పందించలేదని, థియేటర్‌ నుంచి వెళ్లేందుకు మొదట నిరాకరించారనే విషయాన్ని తనకు పోలీస్ కమిషనర్ చెప్పారని రేవంత్ రెడ్డి స్వయంగా శాసనసభలో చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా రేవంత్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తనకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని, తాను ఎలాంటి ర్యాలీలు చేయలేదని చెప్పారు. అల్లు అర్జున్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. శాసనసభ వేదికగా సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టడంపై కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ దిష్టి బొమ్మను దహనం చేశారు.


జూబ్లీహిల్స్‌లో..

కాంగ్రెస్ నేత, హైదరాబాద్ మాజీ డిజ్యూటీ మేయర్ బాబా పసియుద్దిన్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అల్లు అర్జున్ తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ కేటీఆర్ డైరెక్షన్‌లో నటిస్తున్నారని బాబా పసియుద్దిన్ విమర్శించారు. మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ కేటీఆర్ రాసిచ్చిందేనన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జు‌న్‌తో కేటీఆర్ టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. డ్రామారావు నాటకాలు ఎలా ఉంటాయో 20 ఏళ్ల పాటు తాను దగ్గరగా చూశానన్నారు. కేటీఆర్ ని నమ్ముకుంటే అల్లూ ఫ్యామిలీ రోడ్డున పడ్డట్లేనన్నారు. ఈ ఎపిసోడ్‌ను పొలిటికల్ టర్న్ తిప్పింది బీఆర్ఎస్ నేతలని ఆరోపించారు. అల్లు అర్జున్ రీల్ లైఫ్ లో మాత్రమే హీరో అని.. రియల్ లైఫ్‌లో మాత్రం కాదన్నారు. ఆయనలో ఎంత మానవత్వం ఉందో ప్రజలందరికీ అర్థమవుతుందని తెలిపారు. అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంపై బురదజల్లితే ఊరుకోబోమని హెచ్చరించారు.


అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తాం..

కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని బాబా పసియుద్దిన్ తెలిపారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామన్నారు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అల్లు అర్జున్ చెప్పడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా వాస్తవాలను ప్రజలకు తెలియజేశారన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ఎవరికైనా ఒకే న్యాయం ఉంటుందన్నారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో పశ్చాత్తాపం ఎక్కడా కనిపించలేదన్నారు. అల్లు అర్జున్ సినిమా థియేటర్‌లో ఎంత సేపు ఉన్నారు.. వెళ్లేటప్పుడు ఎలా వెళ్లారో మొత్తం వివరాలు, ఆధారాలు ఉన్నాయన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 04:17 PM