Cyber fraud :కొత్త తరహా మోసం..రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
ABN , Publish Date - Oct 04 , 2024 | 12:20 PM
హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు బాధితుడిని మోసం చేశారు.. బాధితుడి దగ్గరి నుంచి రూ.10.61 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడు(73) తనకు ఎలాంటి సంతానం లేకపోవడంతో డబ్బునంతా బ్యాంకులో జమ చేసుకున్నాడు.
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ క్రైం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీరిలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. మరోసారి భాగ్యనగరంలో ఓ బాధితుడు వీరి వలలో పడ్డాడు. వారు ఎక్కడి నుంచో ఫేక్ ఖాతాలు సృష్టించి అమాయకుడిని బెదిరించి భారీగా నగదును స్వాహా చేశారు. బాధితుడు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు అసలు విషయం చెప్పాడు. పోలీసులకు మోసపోయిన విషయం చెప్పడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివారాల్లోకివెళ్తే..
తాజాగా హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు బాధితుడిని మోసం చేశారు.. బాధితుడి దగ్గరి నుంచి పదికోట్ల అరవై లక్షల రూపాయలకు పైగా సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడు(73) తనకు ఎలాంటి సంతానం లేకపోవడంతో డబ్బునంతా బ్యాంకులో జమ చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది జూలై 8న ఆ వృద్ధుడికి సైబర్ మోసగాళ్లు వాట్సాప్ కాల్ చేసి, ముంబైలో వృద్ధుడి పేరు మీద ఒక బ్యాంకు అకౌంట్ తెరిచారని, దాని మీద మనీలాండరింగ్ జరిగిందని బాధితుడిని భయపెట్టారు. అంతేకాకుండా వాట్సాప్‌లో ఈడీ, ఐటీ విభాగాల పేరిట కొన్ని లేఖలు కూడా పంపించారు.
తనకు ఈ మనీలాండరింగ్‌కి సంబంధం లేకుండా చేయాలంటే తాము చెప్పినట్టు వినాలని వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. మనీలాండరింగ్‌కి తనకు సంబంధం లేదని తేలాలంటే ఆయన ఖాతాల్లోని నగదును, అలానే హిందూ వివాహచట్టం ప్రకారం తన భార్య పేరిట ఉన్న ఖాతాలోని డబ్బును కూడా తమకు పంపాలని సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు గురిచేశారు.. ఈ నేరంతో మీ డబ్బుకు సంబంధం లేదని మా దర్యాప్తులో తేలితే మూడే రోజుల్లో మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని, అవసరమైతే మేమే కోర్టుకు హాజరవుతామని నమ్మించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే 3 నుంచి7 ఏళ్ల శిక్ష తప్పదని, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారని వృద్ధుడిని భయపెట్టారు. దీంతో గత జూలై 8 వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 11 విడతలుగా బాధితుడి ఖాతాల్లోని మొత్తం రూ.పది కోట్ల అరవై లక్షలకు పైగా నేరగాళ్లు సూచించిన ఖాతాల్లోకి వృద్ధుడు పంపించాడు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు వృద్ధుడికి కాల్ చేయడం మానేశారు. నేరంతో సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లోనే డబ్బును తిరిగి ఖాతాలకు బదిలీ చేస్తామని చెప్పి, రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో వృద్ధ దంపతులు టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఝాన్సీ, గోరక్ పూర్, వారణాసి, బెంగళూరు, గురుగ్రామ్, బిహార్, మణిపుర్‌లలోని పలు ప్రాంతాలకు చెందిన ఖాతాలకు ఆ డబ్బు వెళ్లిందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. సైబర్ క్రైం పోలీసులు ఈ కేసులో వేగం పెంచారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.