Bengaluru-Hyderabad: జస్ట్ రూ. 100 లతో పోలీసులకు చుక్కలు చూపించిన 12 ఏళ్ల పిల్లాడు..!
ABN , Publish Date - Jan 24 , 2024 | 04:44 PM
Bengaluru-Hyderabad: ఆదివారం బెంగళూరు నుండి తప్పిపోయిన 12 ఏళ్ల బాలుడు బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. పోలీసులు వెతికినా సాధ్యం కాని అతని ఆచూకీని సోషల్ మీడియా కనిపెట్టేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ పిల్లాడు తన చేతిలో ఉన్న 100 రూపాయలతో బెంగళూరు నుంచి బయలుదేరి.. 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
బెంగళూరు/హైదరాబాద్, జనవరి 24: ఆదివారం బెంగళూరు నుండి తప్పిపోయిన 12 ఏళ్ల బాలుడు బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. పోలీసులు వెతికినా సాధ్యం కాని అతని ఆచూకీని సోషల్ మీడియా కనిపెట్టేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ పిల్లాడు తన చేతిలో ఉన్న 100 రూపాయలతో బెంగళూరు నుంచి బయలుదేరి.. 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. మిస్ అయిన బెంగళూరు నుంచి అతన్ని ట్రాక్ చేసి, రీచ్ అయ్యేందుకు ప్రయత్నించిన ప్రతిసారి అక్కడి నుంచి జంప్ అవుతున్నాడు బాలుడు. చివరకు మూడు రోజుల తరువాత పిల్లాడి ఆచూకీ హైదరాబాద్‌లో లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులోని డీన్స్ అకాడమీకి చెందిన ప్రణవ్(12).. మూడు రోజుల క్రితం మిస్ అయ్యాడు. ఉదయం 11 గంటలకు వైట్‌ఫీల్డ్‌లోని కోచింగ్ సెంటర్ నుంచి బయలుదేరిన ప్రణవ్.. చీకటి పడినప్పటికీ ఇంటికి రాలేదు. దాంతో కంగారు పడిన ప్రణవ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రవణ్ కదలికలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఉదయం 11 గంటలకు కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిన ప్రణవ్.. మధ్యాహ్నం 3 గంటలకు యెమ్లూర్ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద కనిపించాడు. ఆ కాసేపటికే బెంగళూరులోని మేజిస్టిక్ బస్ టెర్మినస్‌లో సాయంత్రం బస్ దిగాడు. చివరగా ప్రణవ్ అక్కడే కనిపించాడు. అక్కడి నుంచి మైసూర్‌కు, ఆ తరువాత చెన్నైకి, చెన్నై నుంచి హైదారబాద్‌కు చేరుకున్నాడు ప్రణవ్.
అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రణవ్ వద్ద కేవలం రూ. 100 ఉన్నాయట. డబ్బుల కోసం తన వద్దనున్న పార్కర్ పెన్నులను విక్రయించాడట. ఒక్కో పెన్నును రూ. 100 చొప్పున విక్రయించి డబ్బులు సమకూర్చుకున్నాడు. ప్రణవ్ పెన్నులు విక్రయిస్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. అయితే, ప్రణవ్ ఆచూకీ తెలియకపోవడంతో.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మరోవైపు తీవ్ర ఆందోళనలో ఉన్న అతని తల్లిదండ్రులు.. ప్రణవ్‌ను కనిపెట్టేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించారు. ప్రణవ్ ఫోటోను, అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అతని ఆచూకీ తెలిస్తే చెప్పాల్సిందిగా అభ్యర్థించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అబ్బాయి ఆచూకీని కనిపెట్టేందుకు చాలా మంది దీనిని రీపోస్ట్, షేర్ చేశారు.
మొత్తానికి మూడు రోజులు గడిచిన తరువాత.. బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ప్రణవ్‌ను ఓ వ్యక్తి గుర్తించాడు. సోషల్ మీడియాలో ప్రణవ్ మిస్సింగ్ పోస్ట్ చేసిన వ్యక్తి.. ప్రణవ్ తన ఎదుటే ఉండటాన్ని గమనించాడు. వెంటనే అతన్ని పట్టుకుని.. అతని తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఆపై విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశాడు సదరు వ్యక్తి. ప్రణవ్ తల్లిదండ్రులు ప్రస్తుతం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ప్రణవ్ ఎందుకిలా చేశాడో తమకు తెలియదంటున్నారు అతని తల్లిదండ్రులు. మొత్తానికి మిస్ అయిన బాలుడిని సోషల్ మీడియా పట్టించేసింది. దాంతో అప్పటి వరకు కన్నీళ్లతో నిండి ఉన్న ఆ తల్లి కళ్లు.. ఇప్పుడు ఆనందంతో కుదిటపడ్డాయి.