Bhatti Vikramarka: ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం చేశారు.. కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
ABN , Publish Date - Dec 06 , 2024 | 08:25 PM
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు రూ.61 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు.
హైదరాబాద్: ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక శాఖను ముందుకు కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రపంచ వాతావరణం వల్ల గ్రీన్ ఎనర్జీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ తీసుకురాబోతున్నామని చెప్పారు. ఇవాళ(శుక్రవారం) గాంధీ భవన్ లో భట్టి విక్రమార్క మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ శాఖలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఒక్క యాద్రాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల ప్రతి ఏటా రూ.170 కోట్లకు పైగా భారం పడుతుందన్నారు. ఛత్తీస్ గడ్ ఒప్పందాల వల్ల రూ.630 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసి యాదాద్రిలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల విద్యుత్ డిస్కంలపై దాదాపుగా రూ.10వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 24 గంటల పాటు కరెంటు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
50లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్ లో అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్ని రంగాల విజన్ డాక్యుమెంట్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ తయారు చేస్తోందని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడటమే బీఆర్ఎస్ నేతల పని అని విమర్శించారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. మొత్తం రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ.52 వేల కోట్లు అప్పు చేసిందని భట్టి విక్రమార్క వివరించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని విమర్శించారు.సంక్షేమ పథకాలకు రూ.61 వేల కోట్లు వెచ్చించామన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, చేయూత, ఆరోగ్యశ్రీ పథకాలకు నిధులు ఇచ్చామని గుర్తుచేశారు.ఎల్‌పీజీ, విద్యుత్ రాయితీ, రైతుబీమా పథకాలకు నిధులు కేటాయించామని అన్నారు. ఉపకారవేతనాలు, డైట్ ఛార్జీలు, కల్యాణలక్ష్మికి నిధులు కేటాయించామని చెప్పారు.ప్రతి ఏడాది క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వంలో 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Congress: అస్థిరత నుంచి సుస్థిరత దాకా
CM Revanth Reddy: కేసీఆర్! ప్రతిపక్ష నేతగా.. నీ డ్యూటీ చెయ్
KTR: రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా.. కాంగ్రెస్ తల్లినా
Read Latest Telangana News And Telugu News