Group-2 Exams : గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఎగ్జామ్‌కు ముందు కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 14 , 2024 | 12:24 PM
గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్ టికెల్, ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్ధులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలను పరిశీలించుకోవాలని సూచించారు.
హైదరాబాద్: గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గ్రూప్ 2 పరీక్ష ఎమోషనల్ అటాచ్‌మెంట్ అయిందని చెప్పారు. ఇప్పటికే నాలుగుసార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని అన్నారు. 5,51,847 మంది విద్యార్థులు గ్రూప్ 2 కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. 1368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. 58 రీజనల్ కో అర్దినేటర్లను నియమించామన్నారు. పరీక్ష కోసం 65వేల మంది సిబ్బంది వివిధ పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. 75 శాతం అభ్యర్థులు హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. 783 ఉద్యోగాలకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి లోపు గ్రూప్ 1 పరీక్షల రిజల్ట్ ఇస్తామని అన్నారు.
పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఓంఎఆర్ షీట్ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అభ్యర్థులు బయోమెట్రిక్ తప్పకుండా వేయాలన్నారు. 2015లో గ్రూప్ 2 వేస్తే 2019 వరకు పూర్తవలేదని అన్నారు.వీలైనంత త్వరగా ఫలితాలను ఇస్తామని స్పష్టం చేశారు. టీజీపీఎస్సీని పూర్తి స్థాయిలో నమ్మాలని అన్నారు. పరీక్షల పూర్తి వ్యవహారం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని చెప్పారు. 58 కేంద్రాల్లో పరీక్ష పత్రాలు, ఓఏంఆర్ షీట్లు సిద్ధంగా ఉంచామని అన్నారు. పరీక్ష పత్రాన్ని అభ్యర్థి తప్పా ఎవరూ చూడలేరని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు డిపార్ట్‌మెంట్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్లను నియమించి వారికి పరీక్ష నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందించారు. టీజీపీఎస్సీ అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం పరీక్షకు 8:30 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1:30 గంటల నుంచి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల గేటు ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటలకు మూసివేస్తారు, ఆ తర్వాత ఎవరిని అనుమతించరు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తమ వెంట బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్నులు, ఫొటోతో కూడిన హాల్‌టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది.
హాల్‌టికెట్‌పై పాస్‌పోర్టు సైజ్ ఫొటో ముద్రించి తీసుకెళ్లాలి. ఒకే హాల్‌టికెట్‌ను పరీక్ష మొత్తం వినియోగించాల్సి ఉంటుంది. హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా లేకపోతే అభ్యర్థి మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు గెజిటెడ్ అధికారి లేదా చివర చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపాల్ సంతకంతో తీసుకువచ్చి పరీక్షాహాల్‌లో ఇన్విజిలేటర్‌కు అప్పగించాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్, బ్లూ టూత్ డివైసెస్, జువెల్లరీ, ఎలక్ర్టానిక్ గాడ్జెట్ తదితర సామగ్రి అనుమతించరు. చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని, షూస్ వేసుకోవద్దని టీజీపీఎస్సీ సూచించింది. సెల్‌ఫోన్ బ్లూటూత్ ఇతర ఎలక్రానిక్ గాడ్జెట్స్ అభ్యర్థులు తీసుకువస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ విడిచి వెళ్లరాదు. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ అనుమతించరు. బయోమెట్రిక్ విధానం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు మెహందీ టాటూ వంటివి పెట్టుకోవదని టీజీపీఎస్సీ సూచించింది. ప్రతి పేపర్ సమయంలో అభ్యర్థి ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌పై సంతకం పెట్టాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి నిర్దేశిత సమయానికంటే గంట ముందే చేరుకోవాలి. మోడల్ ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని సరిగ్గా బబుల్స్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఓఎంఆర్ షీట్‌ను సరిగా చెక్ చేసుకోవాలి. పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు పరీక్షా హాల్‌ను విడిచి వెళ్లవద్దు. టీజీపీఎస్సీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు మూసి వేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG NEWS:అల్లు అర్జున్ అరెస్ట్‌పై మంత్రుల షాకింగ్ కామెంట్స్
Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
Hyderabad: సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..
For Telangana News And Telugu News