TG News: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు.. బీఆర్ఎస్ నేతల విసుర్లు
ABN , Publish Date - Sep 27 , 2024 | 09:22 PM
జిల్లా మంత్రులు తమ సొంత పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శించారు. హైదరాబాద్, నల్లగొండ తిరుగుతున్నారు తప్ప.. సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ(శుక్రవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
నల్లగొండ: జిల్లా మంత్రులు తమ సొంత పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శించారు. హైదరాబాద్, నల్లగొండ తిరుగుతున్నారు తప్ప.. సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ(శుక్రవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ... మిషన్ భగీరథపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్.. నల్గొండ ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమి కొట్టారని అన్నారు.
నెల్లికల్ లిఫ్ట్‌పై ప్రజలకు కోమటిరెడ్డి స్పష్టత ఇవ్వాలని అన్నారు. అమృత్ స్కాంపై మాజీ మంత్రి కేటీఆర్ పూర్తి ఆధారాలతోనే మాట్లాడారని చెప్పారు. రేవంత్ రెడ్డి దగ్గర కాంట్రాక్టుల కోసమే.. కోమటిరెడ్డి కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేలు ఎవరూ లేరని అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులు చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అని ప్రశ్నించారు. జైల్లో వేస్తే.. కాళేశ్వరం ఇంజినీర్లు మిగలరని రేవంత్ అనడం ప్రభుత్వ ఉద్యోగులను అవమానపరచడమేనని అన్నారు. కాళేశ్వరం లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? అని నోముల భగత్ ప్రశ్నించారు.
శ్రీశైలం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి: బీరం హర్షవర్ధన్ రెడ్డి
హైదరాబాద్: శ్రీశైలం నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. శ్రీశైలం నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. శ్రీశైలం నిర్వాసితుల్లో 78 మందికి కేసీఆర్ ప్రభుత్వం లష్కర్లుగా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిందని వివరించారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ(శుక్రవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... పాలమూరు జిల్లాకు మంత్రులు గాలి మోటార్లలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆస్పత్రులు అధ్వాన్నంగా మారాయని బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు.
6 గ్యారంటీలను అమలు చేయాలి: జాజుల సురేందర్
6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం తప్ప రేవంత్ రెడ్డి సాధించిందేమీ లేదని అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ హామీలపై ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల బిల్లులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రుణమాఫీ కాక అన్నదాతలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలని జాజుల సురేందర్ డిమాండ్ చేశారు.