Share News

KTR: పాల‌న చేత‌కాకే ప‌నికిమాలిన‌ మాట‌లు: కేటీఆర్..

ABN , Publish Date - Oct 18 , 2024 | 08:57 AM

తెలంగాణలో పాలన చేత‌కాకే కాంగ్రెస్ పార్టీ నేతలు ప‌నికిమాలిన‌ మాట‌లు, పాగ‌ల్ ప‌నులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు.

KTR: పాల‌న చేత‌కాకే ప‌నికిమాలిన‌ మాట‌లు: కేటీఆర్..

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, పాలన చేతకాకే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మూసీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పాలన చేత‌కాకే ప‌నికిమాలిన‌ మాట‌లు, పాగ‌ల్ ప‌నులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్నట్లు ప‌రిపాల‌న, అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో కాంగ్రెస్ పార్టీ పొర్లుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేతలు తమకు అంటిన మూసీ బురదను అందరికీ అందించాలని చూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


నంబర్-1గా నిలబెట్టాం..

"మూసీ ప్రాజెక్టుతోనే హైద‌రాబాద్ అభివృద్ధి అవుతుంద‌ని చెప్పే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (ప‌ర్ క్యాపిటా) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌ వ‌న్ అయ్యింది. మూసీ ప్రాజెక్టులో రూ.1.50 లక్షల కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానం సాధించింది. బిల్డర్లు, రియల్టర్లను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసింది. మీ బడే భాయ్ మోదీ ఐటీఐఆర్ (ITIR)ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక్క రూపాయీ సహాయం చేయకపోయినా, ఐటీ ఎగుమతుల విషయంలో 2035 నాటికి చేరుకోవాల్సిన టార్గెట్‌ని 11 ఏళ్ల ముందేగానే 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిది. దిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే తెలంగాణ విత్తన భాండాగార‌మైంది. దేశంలోనే ధాన్య సిరిగా మారింది.


పరువు తీయకు..

పేద‌ల కంట క‌న్నీరు లేకుండానే పారిస్, బొగొటా, మెక్సికో సిటీ, మోంటేరియల్‌ను అధిగ‌మించి ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ సిటీ అవార్డును హైద‌రాబాద్‌ ద‌క్కించుకుంది. మూసీ న‌దికి అటు ఇటు అభివృద్ధి, ఆకాశ హ‌ర్మ్యాలు కడుతున్నప్పుడు మ‌రి ఫోర్త్ సిటీ ఎందుకు?. మూసీ పక్కన పెట్టుబ‌డి పెట్టేందుకు ఫోర్ బ్రదర్స్ మ‌నీ స్పిన్నింగ్ కోస‌మా?. ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు ?. కుర్చీలో కూర్చుంటేనో, సమావేశాల్లో త‌ల కింద‌కీ మీద‌కీ తిప్పితేనో అభివృద్ధి జ‌ర‌గ‌దు. ప్రభుత్వ పాఠ‌శాలలో చ‌దువుకున్నా అంటూ ప్రభుత్వ బ‌డి పిల్లల పరువు తీయకు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుత‌మైన ఇంగ్లీష్ మాట్లాడ‌తారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు" అని కేటీఆర్ అన్నారు.


మరోవైపు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాకు. మూసీ సుందరీకరణపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చర్యలను వివరించనున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: నల్లా మీటర్‌ పనిచేయట్లే!

Hyderabad: అనుమతి రెండుకు.. నిర్మిస్తోంది ఆరు

Updated Date - Oct 18 , 2024 | 08:57 AM