Share News

Telangana: CM అంటే ‘కటింగ్ మాస్టరా’? కేటీఆర్ సెటైరికల్ ట్వీట్..

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:29 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసి.. ఇప్పుడు ఆ హామీల్లో కోతలు పెడుతున్నారంటూ దుయ్యబట్టారు.

Telangana: CM అంటే ‘కటింగ్ మాస్టరా’? కేటీఆర్ సెటైరికల్ ట్వీట్..
BRS Working President KTR

హైదరాబాద్, జూన్ 23: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసి.. ఇప్పుడు ఆ హామీల్లో కోతలు పెడుతున్నారంటూ దుయ్యబట్టారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. ‘CM అంటే కటింగ్ మాస్టరా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకంలో కోత విధిస్తోందని ఆరోపించిన ఆయన.. ఆ కోతలను ఉద్దేశిస్తూ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు.


కేటీఆర్ ‘ఎక్స్ పోస్ట్’ యధావిధిగా..

‘ముఖ్యమంత్రి గారు CM అంటే ‘కటింగ్ మాస్టరా’? ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా? CM అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా? నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు.. రూ. 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. మొదలు రూ. 39 వేల కోట్లు అని ఇప్పుడు రూ. 31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు. పాసు బుక్కులు లేవనే నెపంతో.. లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం.. రేషన్ కార్డు సాకు చూపి.. లక్షల మందికి మొండి చెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించం.. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోం.’ అని సీఎం రేవంత నిర్ణయాలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.


‘మొన్న.. లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారు. నిన్న.. 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు. నేడు.. 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదు. ఓట్ల పండగ ముగిసినా.. ఎకరానికి రూ. 7,500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదు. కాంగ్రెస్ ప్రచారంలో “అందరికీ అన్నీ” అన్నారు. అధికారంలోకి రాగానే “కొందరికే కొన్ని” అని కోతపెడుతున్నారు. రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా.. లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతాం.’ అని సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 23 , 2024 | 06:30 PM