Chamala Kiran Kumar Reddy: ఆ దాడి వెనుక బీఆర్ఎస్ ప్రోద్బలం.. చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Nov 12 , 2024 | 10:53 AM
బీఆర్ఎస్ పార్టీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మూడుసార్లు గెలిపించిన కొడంగల్ లాంటి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకునేందుకు అధికారులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
భువనగిరి: వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్‌పై నిన్న చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఒక కలెక్టర్‌పై దాడి చేయడం అంటేనే ప్రజాస్వామ్యం ఎటు పోతుందో అర్థం కావడం లేదని చెప్పారు. భువనగిరి కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అధికారం పోయిన బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలని దానిపైనే దృష్టి సారించారని అన్నారు.
ఫార్మాసిటీ కోసం పబ్లిక్ ఇయర్ రింగ్ చేస్తున్న అధికారికి సమస్యలు ఉంటే చెప్పుకోవాలి కానీ దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారులపై దాడులు చేయడానికి బీఆర్ఎస్ ప్రోద్బలం కారణమని ఆరోపించారు. గత పదిహేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేసిందని ఆరోపించారు. ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందని విమర్శించారు. దేశంలో ఎక్కడ కూడా భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై దాడులు జరగలేదని చెప్పారు.
ఇలాంటి వైఖరితో బీఆర్ఎస్ ఎలాంటి మెసేజ్‌ను ప్రజల్లోకి పంపిస్తుందో అర్థం చేసుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మూడుసార్లు గెలిపించిన కొడంగల్ లాంటి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకునేందుకు అధికారులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారితో పాటు ప్రోత్సహించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.
ఏమైందంటే..
కాగా..సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారింది. రైతులతో మాట్లాడేందుకు తమ వాహనాలు దిగి సమావేశం జరిగే స్థలానికి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేకాధికారులకు వ్యతిరేకంగా గోబ్యాక్, డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేస్తూ దూసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ సహ అఽక్కడకు వచ్చిన అధికారులు.. మీ సమస్య, డిమాం డ్లు చెప్పాలంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. అప్పటికీ అధికారులు సంయమనం కోల్పోకుండా రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా... సమావేశానికి వచ్చిన రైతులు, ప్రజలు ఆగ్రహంతో అధికారులపైకి దూసుకువచ్చారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూ రు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలను ముం దుకు తోస్తూ చాలా దురుసుగా వ్యవహరించారు. తమ ఎదురుగా ఉన్నది కలెక్టర్ అనీ కూడా చూడకుండా రణరంగం సృష్టించారు.
ఊహించని పరిణామానికి అధికారులు, వారి వెంట వచ్చిన సిబ్బంది హాహాకారాలు, రైతుల ఆగ్రహావేశాలు, దూషణలతో లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణ చేపట్టేందుకు సోమవారం దుద్యాల మండలం, లగచర్లలో సమావేశం ఏర్పాటు చేశారు. భూములు కోల్పోతున్న పోలెపల్లి, హకీంపేట్, పులిచర్ల కుంట తండా, రోటిబండ తండా, లగచర్ల గ్రామాల రైతులు సమావేశాన్ని బహిష్కరించి.. నిరసనగా లగచర్లలోనే ఉండిపోయారు. సమావేశం ఏర్పాటు చేసిన స్థలం వద్దకు కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఇతర అధికారులు వెళ్లగా అక్కడ కొందరు రైతులు మాత్రమే ఉన్నారు. రైతులు ఎక్కడున్నారని అక్కడున్న వారిని ప్రశ్నించగా, రైతులందరూ లగచర్ల గ్రామంలో ఉన్నారు, అక్కడికి వచ్చి మాట్లాడాలంటూ లగచర్లకు చెందిన బోగమోని సురేశ్‌తో పాటు అక్కడున్న మరికొందరు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి లగచర్లకు వాహనాల్లో చేరుకున్నారు. అధికారులు వాహనాల్లో నుంచి దిగుతుండగానే అక్కడున్న రైతులు ఒక్కసారిగా కలెక్టర్ డౌన్, డౌన్, కలెక్టర్ గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు. రైతుల ఆగ్రహాన్ని గుర్తించిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అఽధికారులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుండగా, వినిపించుకోకుండా అధికారులపైకి దూసుకువచ్చారు. అధికారులు చెప్పేది వినిపించుకోకుండా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెంటనే అప్రమత్తమై కలెక్టర్‌ను చాకచక్యంగా అక్కడి నుంచి కారులో పంపించేశారు.