Share News

CM Revanth Reddy: కమ్మ అంటేనే.. అమ్మలాంటి ఆప్యాయత

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:27 PM

కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు.. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారని అన్నారు.

CM Revanth Reddy: కమ్మ అంటేనే.. అమ్మలాంటి ఆప్యాయత
CM Revanth Reddy

హైదరాబాద్: కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు.. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారని అన్నారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారని చెప్పారు. కష్టపడటం పదిమందికి సాయం చేయడం కమ్మవారి లక్షణమన్నారు. కమ్మ గ్లోబల్ సమ్మిట్‌ను ఈరోజు(శనివారం) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది.


CM-REVANTH.jpg

ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కమ్మ సామాజికవర్గం తనను ఎంతగానో అభిమానిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకున్న చదువు, తమను ఉన్నత స్థానంలో నిలబెట్టిందని గుర్తుచేశారు. నాయకత్వానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని వివరించారు. ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారని ఉద్ఘాటించారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఈరోజు చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు కమ్మవారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


1-c4.jpg

కమ్మవారిలో ఉన్న నైపుణ్యాలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. తమకు భేషజాలు లేవని.. తాము కులాన్ని అభిమానిస్తామని.. ఇతర కులాలను గౌరవిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదని.. అది తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు అని చెప్పారు. నిరసన తెలపకుండా నియంత్రించాలనుకుంటే.. ఫలితాలు ఎలా ఉంటాయో చూశారని గుర్తుచేశారు.


1-cm.jpg

జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తోందని గుర్తుచేశారు. కుల, మతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో రాణించే తెలుగువారిని ప్రోత్సహించాలని చెప్పారు. వివాదంలో ఉన్న 5ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూ సమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పదిమందికి సాయం చేసే కమ్మవారు సహజ గుణాన్ని వీడొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.

Updated Date - Jul 20 , 2024 | 04:29 PM