CM Revanth Reddy: అస్వస్థతకు గురైన విద్యార్థులు.. ఘటనపై సీఎం రేవంత్ సీరియస్..
ABN , Publish Date - Nov 20 , 2024 | 09:28 PM
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 100మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 100మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఫోన్ చేసి ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం హుకుం జారీ చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై వెంటనే విచారణ జరిపి, తనకు నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని చెప్పారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీపడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..
నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం అన్నం, పప్పు, సాంబారు, గుడ్లతో విద్యార్థులు భోజనం చేశారు. అయితే కాసేపటి తర్వాత ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవ్వడం ప్రారంభించారు. కళ్లు తిరగడం, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అలాగే స్థానిక వైద్యులను పిలిపించి కొంతమంది విద్యార్థులకు పాఠశాలలోనే ప్రథమ చికిత్స అందించారు. మరి కొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మహబూబ్ నగర్‌కు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే విద్యార్థులను ఎవరి ఇళ్లకు వారు వెళ్లాల్సిందిగా ఉపాధ్యాయులు భయపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫుడ్ పాయిజన్ విషయాన్ని దాచేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దల్‌ఘని వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. అయితే అప్పటికే పెద్దఎత్తున చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు.. ఘటనకు వంట ఏజెన్సీ, ప్రధానోపాధ్యాయుడే కారణమంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లగా.. ఆయన అధికారులను విచారణకు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: బాబోయ్.. ఘరానా మోసం.. బంగారు బిస్కెట్లు ఇస్తామంటూ కుచ్చుటోపీ..
Telangana: సీఎం రేవంత్‌లో విషయం తక్కువ.. విషం ఎక్కువ: హరీష్ రావు