Share News

CM Revanth: గద్దర్ అవార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 29 , 2024 | 10:23 PM

గద్దర్ అవార్డుల అంశంపై సినీరంగ ప్రముఖులు ప్రతిపాదనలతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కోరారు. నంది అవార్డులంత గొప్పగా డిసెంబర్9న గద్దర్ అవార్డులు ఇస్తామని గతంలో ఈ వేదికగా ప్రకటించానని స్పష్టం చేశారు.

CM Revanth: గద్దర్ అవార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
CM Revanth Reddy

హైదరాబాద్: గద్దర్ అవార్డుల అంశంపై సినీరంగ ప్రముఖులు ప్రతిపాదనలతో ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కోరారు. నంది అవార్డులంతా గొప్పగా డిసెంబర్9వ తేదీన గద్దర్ అవార్డులు ఇస్తామని గతంలో ఈ వేదికగా ప్రకటించానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కానీ సినీరంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. సోమవారం నాడు రవీంద్ర భారతిలో విశ్వంభర డా.సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు. హాజరయ్యారు.


నారాయణ రెడ్డి తెలుగు జాతికి గర్వకారణం

డా.సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ తమిళ రచయిత్రి, సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత శ్రీమతి శివ శంకరికి విశ్వంభర డా.సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సాహిత్య పురస్కార గ్రహీత శివశంకరి‌కి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కవిగా, వైస్ చాన్స్‌ల‌ర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా నారాయణరెడ్డి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఒక తెలంగాణకే పరిమితం కాదు... ఆయన తెలుగు జాతికి గర్వ కారణమని ముఖ్యమంత్రి ప్రశంసించారు.


గ్రంథరూపంపై సాయమందిస్తాం...

మారుమూల ప్రాంతం నుంచి తెలుగు జాతి గర్వించదగ్గ స్థాయికి ఎదిగారని ప్రశంసలు కురిపించారు. వారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. వారు కేవలం యధాలాపంగా రచనలు చేయలేదని ప్రతీది లీనమై రచించారని వివరించారు. అందుకే ఆయన రచనలను మనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నామని సీఎం ఉద్ఘాటించారు. సి.నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం ఏం చేయాలో త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎవరైనా వారి రచనలను గ్రంథరూపం చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 10:32 PM