CM Revanth: ధరణిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jul 26 , 2024 | 06:26 PM
ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
హైదరాబాద్: ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy) సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ విషయంలో రైతులు నానా ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటివేమి ఉండకూడదని భావించిన రేవంత్.. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ధరణి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో ధరణిపై పలు అంశాలపై సీఎం రేవంత్ సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని సూచించారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
ధరణిపై కీలకంగా చర్చించిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్, సీఎస్ ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు.
మరోవైపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. పంచాయితీ రాజ్ ఎన్నికలు , కార్యాచరణపై శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.
పంచాయతీరాజ్‌పై ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్‌కు సూచించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.