TG Hostel Diet Charges : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Oct 31 , 2024 | 08:56 PM
దీపావళి వేళ.. తెలంగాణలోని విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది.
హైదరాబాద్: ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డైట్, కాస్మోటిస్ చార్జీలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 నుంచి7వ తరగతి విద్యార్థులకు రూ. 950 నుంచి 1330లకు పెంచింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ. 1100 నుంచి 1540 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ.1500 నుంచి 2100రూపాయలకు కాస్మొటిక్ చార్జీలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదు నెలల నుంచి విడుదల కానీ బిల్లులు..
కాగా.. వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన నిధులు(డైట్ బిల్లులు) మంజూరు కాలేదు. అలాగే కాస్మోటిక్ చార్జీలు కూడా ఇవ్వడం లేదు. ఐదు నెలల నుంచి ఈ సమస్య ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. చేసేదిలేక ఆయా సంక్షేమ అధికారులు చేతిలో నుంచి డబ్బులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నెలలుగా బిల్లుల కోసం ఆయా వార్డెన్లు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభావం విద్యార్థులకు అందజేస్తున్న భోజనంపై పడుతోంది. నాణ్యత తగ్గుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భోజనంలో తగ్గిన నాణ్యత..
వసతిగృహాల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. భోజనంలో నాణ్యత ఉండటం లేదని, మెనూ పాటించడం లేదని కొందరు విద్యార్థులు వాపోయారు. బిల్లులు చెల్లించకుంటే ఎలా అని వార్డెన్లూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఐదు నెలల నుంచి డైట్ బిల్లులు అందక పోవడంతో సంక్షేమ అధికారులు చేతిలో నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. కొంతమంది అప్పులు చేశారు. కాస్మోటిక్ చార్జీల నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి వద్ద నుంచి డబ్బులు తెచ్చుకుని నూనె, షాంపులు, పౌడర్‌లు కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డైట్ బిల్లులతో పాటు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని కోరుతున్నారు.
డైట్, కాస్మెటిక్ చార్జీల పెంపు కోసం కమిటీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... ఈ చార్జీలను పెంచాలంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం తదితరులు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి విజ్తప్తి చేశారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి ఈ నెల 17న బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. డైట్, కాస్మెటిక్ చార్జీల పెంపు కోసం ఈ కమిటీ పలు అంశాలను పరిశీలించింది. గత ప్రభుత్వం కాస్మెటిక్ చార్జీలపై నియమించిన కమిటీ 2023, మార్చి 1న ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించింది. 2022, ఫిబ్రవరి 22న మహిళా శిశు సంక్షేమ శాఖ.... దివ్యాంగుల వసతి గృహాల్లోని విద్యార్థులకు పెంచిన డైట్ చార్జీలను పరిగణనలోకి తీసుకున్నది. అన్నీ పరిశీలించి 40 శాతం మేర నెలవారీ కాస్మెటిక్ , డైట్ చార్జీలను పెంచాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ చార్జీలను పెంచడం వల్ల రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లోని 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కమిటీ వివరించింది.