Etala Rajender: నేషనల్ హైవేలను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 08 , 2024 | 08:06 PM
నేషనల్ హైవేలను త్వరగా పూర్తి చేయాలని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ (Etala Rajender) తెలిపారు. గురువారం నాడు పార్లమెంటులో పలు కీలక విషయాలపై ఈటల మాట్లాడారు.
హైదరాబాద్: నేషనల్ హైవేలను త్వరగా పూర్తి చేయాలని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ (Etala Rajender) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నాడు పార్లమెంటులో పలు కీలక విషయాలపై ఈటల మాట్లాడారు. తెలంగాణలో 1947 నుంచి 2004 లోపు ఎన్ని కిలోమీటర్ల నేషనల్ హైవేలు నిర్మాణం అయ్యాయో.. గత పదేళ్లలో అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల హైవేలు నిర్మాణం అయ్యాయని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్ నుంచి నాగపూర్ జాతీయ రహదారులు నిర్మాణం అయ్యాయని తెలిపారు. కానీ హైదరాబాద్ సిటీ లోపల ట్రాఫిక్ పెరిగిపోవడంతో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని అన్నారు. అందుకోసం అండర్ పాస్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
జోడిమెట్ల చౌరస్తా దగ్గర పది ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన దాదాపు 60 మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారని వివరించారు. విజయవాడ నేషనల్ హైవేపై రెండు ఓవర్ బ్రిడ్జిలు, అలాగే ఛత్తీస్‌గఢ్ హైవేపై రెండు ఓవర్ బ్రిడ్జిలు, కొంపల్లి నుంచి నాగపూర్ హైవేపై ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు. ఈ మార్గాల్లో మెట్రో రైలు నిర్మాణం చేయాలనే డిమాండ్ కూడా ఉందని గుర్తుచేశారు. ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండిటిని కలిపి కోఆర్డినేట్ చేసుకొని నిర్మాణం చేపడితే తక్కువ ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. మంత్రి నితిన్ గడ్కారీ చాలా క్రియాశీలకంగా స్పందిస్తారని ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఈటల రాజేందర్ కోరారు.
నితిన్ గడ్కారీ ఏమ్ననారంటే..?
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అడిగిన పలు ప్రశ్నలకు సభలో నితిన్ గడ్కారీ సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఎంపీ ఈటల రాజేందర్ ఆ రాష్ట్రానికి చాలా పనులు కావాలని అడిగారని చెప్పారు. హైదరాబాద్ రింగ్ రోడ్ కోసం రూ.70 వేల కోట్లును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పనులు తాము చేస్తామని చెప్పారని అన్నారు. 50% ల్యాండ్ అక్విజిషన్‌కి సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నారని. అది పూర్తి అవ్వగానే నిర్మాణం చేపడతామని వివరించారు. ఈ విషయంపై ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా కలిసినట్లు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే రోడ్డుపై చాలా ప్రమాదాలు అవుతున్నాయని చెప్పారు. చాలామంది విద్యార్థులు చనిపోయారని కూడా తమ దృష్టికి వచ్చిందని గుర్తుచేశారు. దీనికి తాము కూడా చింతిస్తున్నామని అన్నారు. ఈ విషయంపై త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని, మిగతా పనులు అన్నీ కూడా త్వరలోనే చేపడతామని నితిన్ గడ్కారీ పేర్కొన్నారు .