Share News

Harish Rao: తెలంగాణలో మహిళలకు భద్రత కరువైంది

ABN , Publish Date - Oct 04 , 2024 | 11:39 AM

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao: తెలంగాణలో మహిళలకు భద్రత కరువైంది

హైదరాబాద్: తెలంగాణలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈమేరకు ఓ ప్రకటనను హరీష్‌రావు విడుదల చేశారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని హరీష్‌రావు అన్నారు.


రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో రెండు వేలకు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. హోం మంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని హరీష్‌రావు మండిపడ్డారు.


కేసీఆర్ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు. షీ టీమ్స్, సఖి భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి భద్రత కల్పించిందని.. కానీ ఇందిరమ్మ రాజ్యం అని ఊదరగొట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలో మహిళా భద్రత లేదని తేటతెల్లమైందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదండి.

నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం

మంత్రి సురేఖ‌ వ్యాఖ్య‌లు.. ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ఏమ‌న్నారంటే

సూర్యాపేట కలెక్టరేట్‌లో లైంగిక వేధింపులు !

tela Rajender : దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2024 | 11:47 AM