High Court : ప్రతిదానికి ముఖ్యమంత్రిదే బాధ్యతనా?
ABN , Publish Date - Jun 12 , 2024 | 05:47 AM
‘ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా? రేపు ఓ బిచ్చగాడు వచ్చి భిక్షాటనే నా ఆదాయం. కానీ, రోడ్డును ఆక్రమించానని ఖాళీ చేయమంటున్నారు. దీనికి ముఖ్యమంత్రే బాధ్యులు అంటే ఏం చేస్తారు?’ అని హైకోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వ శాఖల్లో జరిగే అన్ని చర్యలను సీఎంకు ఆపాదించలేం
ఓయూ హాస్టళ్ల బంద్ నోటీస్‌పై వివాదంలో హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా? రేపు ఓ బిచ్చగాడు వచ్చి భిక్షాటనే నా ఆదాయం. కానీ, రోడ్డును ఆక్రమించానని ఖాళీ చేయమంటున్నారు. దీనికి ముఖ్యమంత్రే బాధ్యులు అంటే ఏం చేస్తారు?’ అని హైకోర్టు ప్రశ్నించింది. వేసవి సెలవుల సందర్భంగా విశ్వవిద్యాలయంలోని వసతిగృహాల మూసివేత నోటీ్‌సపై నెలకొన్న వివాదంలో సీఎం రేవంత్‌రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పలువురు ఓయూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల పిటిషన్‌ను జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. అడ్మిషన్ దశలోనే డిస్మిస్ చేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ శాఖల్లో జరిగే ప్రతి చర్యను ముఖ్యమంత్రికే ఆపాదించలేమని స్పష్టం చేసింది. ‘‘ఒకే వ్యవహారానికి సంబంధించి కౌంటర్ కేసులు పెట్టడం కుదరదు. హాస్టళ్ల మూసివేత వ్యవహారంలో ఫేక్ నోటీసుపై ఇప్పటికే కేసు నమోదైంది. అది విచారణలో ఉండగా ఇంకో కేసు అవసరం లేదు’’ అని పేర్కొంది. ఈ మేరకు రేవంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌ను కొట్టేసింది.