Share News

TG NEWS: భాగ్యనగరంలో ట్రా‘ఫికర్‌’కు చెక్‌ పెట్టేలా.. పోలీసుల సరికొత్త యాక్షన్‌ ప్లాన్‌

ABN , Publish Date - Nov 26 , 2024 | 04:48 PM

ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్యల్లో భాగంగా ఆపరేషన్ రోప్‌ వే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్ పాత్ ఆక్రమణలను పోలీసులు తొలగించడానికి వడివడిగా చర్యలు తీసుకుంటున్నారు.

TG NEWS: భాగ్యనగరంలో ట్రా‘ఫికర్‌’కు చెక్‌ పెట్టేలా.. పోలీసుల సరికొత్త యాక్షన్‌ ప్లాన్‌

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యల (Traffic Problems) పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్ల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.


ఆపరేషన్ రోప్‌లో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్ పాత్ ఆక్రమణలను పోలీసులు తొలగించనున్నారు. ఫిల్మ్ నగర్ నుంచి టోలిచౌకి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు రెండు క్యారేజ్‌వేలలో ఆపరేషన్ రోప్‌ను చేపట్టనున్నారు. ట్రాఫిక్ పోలీసులు, అధికారులతో కలిసి ఆపరేషన్ రోప్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొననున్నారు.


ట్రాఫిక్‌ జాం..

కాగా.. ఆపరేషన్‌ రోప్‌ కార్యక్రమంలో చాలా ప్రాంతాల్లో యూటర్న్‌లను మూసివేసి, కొత్తగా యూటర్న్‌లను క్రియేట్‌ చేసి వాహనాల వేగం పెరిగేలా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇదే కొన్నిచోట్ల ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. ముఖ్యంగా చెక్‌పోస్టు వైపు నుంచి వచ్చే వాహనదారులు జర్నలిస్టు కాలనీకి వెళ్లాలన్నా, రోడ్డు నంబర్‌ 45 మీదుగా కేబుల్‌ బ్రిడ్జి ఫ్లైవోవర్‌పైకి వెళ్లాలన్నా ఫిల్మ్‌నగర్‌లో యూటర్న్‌ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది వాహనదారులు రోడ్డు నంబర్‌ 45కి వెళ్లే దారిలో మూసివేసిన యూటర్న్‌ వద్ద గానీ, జర్నలిస్టు కాలనీ వద్ద మూసివేసి వన్‌వే మాత్రమే పెట్టిన యూటర్న్‌ వద్ద గానీ వాహనాలు మళ్లిస్తున్నారు. అదే సమయంలో అవతలి వైపు నుంచి వస్తున్న వాహనాలు కూడా యూటర్న్‌ తీసుకోవడానికి ప్రయత్నించడంతో ట్రాఫిక్‌ జాం అవుతోంది. నిబంధనల ప్రకారం యూటర్న్‌ తీసుకునే వాహనదారుల ఎదుటివారితో గొడవకు దిగుతున్నారు. ఈ తరహా గొడవలు జూబ్లీహిల్స్‌లో రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి.


యూటర్న్‌ దూరంగా ఉందని రెండు రోజుల క్రితం ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు బైక్‌పై రాంగ్‌ రూట్‌లో వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఒక విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల జూబ్లీహిల్స్‌ పరిధిలో బైక్‌పై వెళ్తున్న అన్నదమ్ములు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ్ముడు మృతి చెందాడు. అన్న తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూ టర్న్‌ తీసుకుంటుండగా.. ఓ వాహనదారుడు రాంగ్‌రూట్లో వచ్చి వీరి వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. త్వరగా వెళ్లాలని, దూరాభారమని రాంగ్‌ రూట్లో వెళ్లి కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.ఇవే కాదు..చాలా ప్రమాదాలకు తొందరపాటే కారణమవుతోంది.


త్వరగా వెళ్లాలని..

ఏటా రోడ్డు ప్రమాదాల బారిన పడి వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కొన్నివేల మంది క్షతగాత్రులు కాళ్లూ, చేతులు కోల్పోతున్నారు. ముఖ్యంగా చాలా మంది వాహనదారులు యూ టర్న్‌ల దగ్గరకు వెళ్లకుండా, రాంగ్‌రూట్‌ (అపసవ్య దిశ)లో వెళ్తున్నారు. సమయం ఆదా చేయాలనుకోవడం, త్వరగా వెళ్లాలనే ఆరాటం, యూటర్న్‌లు దూరంగా ఉంటడం, దూరాభారంతో పెట్రోల్‌ ఖర్చు అవుతుందనే భావనతో కొంతమంది ఇష్టానుసారంగా రాంగ్‌ రూట్లో వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టి ప్రమాదాలకు గురవుతున్నారు.


నిర్లక్ష్యం..రాంగ్‌ డ్రైవింగ్‌..

డివైడర్లు.. యూటర్న్‌లను తప్పించుకోడానికి రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడే కార్లు, ఆటోలను పార్కింగ్‌ చేస్తూ ఫుట్‌పాత్‌లనూ కబ్జా చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. నిబంధనల ఉల్లంఘనే ప్రధాన సమస్యగా మారుతోందని అధికారులు వాపోతున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం, సబ్‌ రోడ్‌ నుంచి మెయిన్‌రోడ్డుకు కనెక్ట్‌ అయ్యే సమయంలో వేగంగా దూసుకెళ్లడం, ఓవర్‌ టేకింగ్‌, డివైడర్‌లు లేని రోడ్ల ప్రాంతాల్లో, రెడ్‌ సిగ్నల్‌ పడిన వేళల్లో దూసుకెళ్లడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. కాస్తముందు జాగ్రత్త, ఆలోచనతో డ్రైవ్‌ చేస్తే ఎన్నో ప్రమాదాలను అరికట్టే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - Nov 26 , 2024 | 04:52 PM