TG Govt: ఫుడ్ సేఫ్టీ వ్యవస్థపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Jul 10 , 2024 | 10:21 PM
నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను ప్రజా ప్రభుత్వం సమూల ప్రక్షాళన మంత్రి దామోదర రాజ నరసింహ (Minister Damodara Raja Narasimha) తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించిందని అన్నారు.
హైదరాబాద్: నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను ప్రజా ప్రభుత్వం సమూల ప్రక్షాళన మంత్రి దామోదర రాజ నరసింహ (Minister Damodara Raja Narasimha) తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 10 మొబైల్ ఫుడ్ ల్యాబ్‌లను త్వరలో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర రాజ నరసింహ ఈరోజు(బుధవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎంతో ఘన చరిత్ర ఉన్న నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంలో స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
రోజూ 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులు
‘‘రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ల్యాబ్స్ ద్వారా రోజువారీగా సుమారు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహిస్తున్నాం. స్ట్రీట్ వెండర్లకు ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు తీసుకునేలా అవగాహనను కల్పిస్తున్నాం. హోటల్స్, రెస్టారెంట్స్, ఆహార పదార్థాల తయారీ సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధులతో ఫుడ్ సేఫ్టీపై రాష్ట్ర సచివాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించాం. ఆహార పదార్థాలు సరఫరా చేసే సంస్థలు తప్పని సరిగా FSSAI లైసెన్స్‌ను తీసుకోవాలనే నిబంధనలను అమలు చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 387 హాస్టళ్లపైన తనిఖీలు నిర్వహించి Fssai లైసెన్సులు విధిగా కలిగి ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహించి ఆహార నాణ్యత ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నాం’’ అని మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థల నిర్వీర్యం
‘‘ఆహార కల్తీ చేసే సంస్థల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించాం. ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా వైద్య, ఆరోగ్యశాఖ కృషి చేస్తుంది. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఎక్స్‌లో నీతులు చెబుతున్నారు. ప్రజా ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీపై తీసుకుంటున్న చర్యలపై ఇదే ' ఎక్స్ ' వేదికగా ప్రపంచం అంతా ప్రశంసిస్తుంటే... కళ్లుండి చూడలేక కొందరు అదే పనిగా ఆరోపణలు చేయడం గురువింద సామెతలను గుర్తుచేస్తుంది. రాష్ట్ర ప్రజలు బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనలను మరచిపోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ హాస్టలల్లో కలుషిత ఆహారం తిని ఆనారోగ్యం పాలైన విద్యార్థుల జ్ఞాపకాలు ఇంకా మర్చిపోలేదు’’ అని మంత్రి దామోదర రాజ నరసింహ పేర్కొన్నారు.