Share News

Reopen Schools : బడికి వేళాయె!

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:01 AM

రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభానికి వేళయింది. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్‌ వంటి అన్నిరకాల స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించడానికి పుస్తకాలు, యూనిఫామ్‌లను ఇప్పటికే సిద్ధం చేశారు.

Reopen Schools : బడికి వేళాయె!

  • నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

  • ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌లు సిద్ధం

  • రూ.600 కోట్లతో స్కూళ్లలో మరమ్మతులు

  • అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు పూర్తి

  • ఇప్పటికే ప్రారంభమైన బడిబాట కార్యక్రమం

  • 2024-25 అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

  • డీఎస్సీ ద్వారా మూడు నెలల్లో కొత్త టీచర్లు

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభానికి వేళయింది. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్‌ వంటి అన్నిరకాల స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించడానికి పుస్తకాలు, యూనిఫామ్‌లను ఇప్పటికే సిద్ధం చేశారు. వీటితోపాటు అమ్మ ఆద ర్శ కమిటీల పర్యవేక్షణలో స్కూళ్లలో మరమ్మతు పనులు, ఇతర అవసరాల ఏర్పాట్లను పూర్తి చేశారు. స్కూళ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఎస్‌హెచ్‌జీ గ్రూపుల సభ్యులు, టీచర్లు, ఇతర అధికారులు ఉన్నారు. స్కూల్‌ పరిధిలో చేపట్టే ప్రతి పనినీ ఈ కమిటీల ద్వారానే నిర్వహిస్తున్నారు.

స్కూళ్లలో మరమ్మతు పనులు, మంచినీటి సరఫరా, టాయిలెట్ల ఏర్పాటు వంటి పనులను ఈ కమిటీలే చూసుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే సుమారు రూ.600 కోట్లతో మరమ్మతు పనులను,మంచినీటి సరఫరా, టాయిలెట్ల ఏర్పాటు వంటి పనులను ఈ కమిటీలే చూసుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే సుమారు రూ.600 కోట్లతో మరమ్మతు పనులను పూర్తి చేశారు. ఇక ఈ విద్యా సంవత్సరానికి (2024-25) సంబంధించిన అకాడమిక్‌ క్యాలెండర్‌ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 229 పనిదినాలు ఉంటాయి.

జూన్‌ 12 నుంచి 2025 ఏప్రిల్‌ 24వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగుతాయి. అక్టోబరు 13 నుంచి 25 వరకు 13 రోజులపాటు దసరా సెలవులు ఇస్తారు. డిసెంబరు 23 నుంచి 27 వరకు క్రిస్మస్‌ సెలవులు, వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ఆరు రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి సిలబ్‌సను వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం రివిజన్‌ తరగతులు నిర్వహించాలి. 1 నుంచి 9వ తరగతులకు సిలబ్‌సను ఫిబ్రవరి 28వ తేదీలోపు పూర్తి చేయాలి. విద్యార్థులందరికీ రోజూ ఐదు నిమిషాలపాటు యోగా, మెడిటేషన్‌ తరగతులు నిర్వహిస్తారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చిలో నిర్వహిస్తారు.


మూడు నెలల్లో కొత్త టీచర్లు..

రాష్ట్రంలో 11 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరో మూడు నెలల్లో ఈ కొత్త టీచర్లను నియమించడానికి వీలుగా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. వీరికితోడు 2008 డీఎస్సీకి సంబంధించి మరో 3వేల మంది ఉపాధ్యాయులను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఇక పాఠశాలలో ఒక్క విద్యార్థి ఉన్నా.. దానిని మూసివేయకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా స్కూళ్లను తెరవాలని అదికారులను ఆదేశించారు.

జీరో అడ్మిషన్‌ స్కూళ్లను మాత్రమే మూసివేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి ఏకోపాధ్యాయ స్కూళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లను పెంచాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్కూళ్లు తెరిచిన తర్వాత దీనిని మరింత విస్తృతంగా నిర్వహించనున్నారు.

బడికి దూరంగా ఉండే పిల్లలను గుర్తించి, వారిని ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు టీచర్ల బదిలీల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. వారం రోజుల్లో దీనిని పూర్తి చేయనున్నారు. దాంతో బదిలీ అయ్యే ఉపాధ్యాయులు కూడా తమ కొత్త పోస్టింగ్‌లో త్వరగా చేరడానికి అవకాశం ఉంటుంది. తద్వారా విద్యా సంవత్సరంలో విద్యార్థుల చదువు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Updated Date - Jun 12 , 2024 | 04:01 AM