Jagadish Reddy: మంత్రి కాగానే కోమటిరెడ్డికి ఇంత అహంకారమా.. బీఆర్ఎస్ నేత ఫైర్
ABN , Publish Date - Jan 29 , 2024 | 06:48 PM
అధికారిక కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ సందీప్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అతని అనుచరుల దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రంగా ఖండించారు.
సూర్యాపేట: అధికారిక కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ సందీప్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అతని అనుచరుల దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రంగా ఖండించారు. సోమవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కాగానే కోమటిరెడ్డికి అహంకారం పెరిగిందని... ఆటవికుడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పి సిగరెట్లు అందించుకుంటూ బతికావని.. ఆ విషయం మరిచిపోయవా అని ప్రశ్నించారు. చరిత్రలు తీద్దామా....వ్యక్తిగత విమర్శలు వొద్దని ఇన్ని రోజులు ఊరుకున్నామని హెచ్చరించారు.
కిరణ్ కుమార్ రెడ్డి గెంటేస్తున్నాడని తెలిసి రాజీనామా చేసి పెద్ద త్యాగం చేశా అని దొంగ డ్రామా చేశావన్నారు. రేవంత్ కాళ్లు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్నావని నీ తమ్ముడే చెబుతున్నాడని విమర్శించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసినా జిల్లాను ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని ప్రశ్నించారు. దౌర్జన్యాలు చేసినోళ్లు కాల గర్భంలో కలిసిపోయారన్నారు. సందీప్ ఒక్క అక్షరం కూడా తప్పు మాట్లాడలేదన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కి విజ్ఞప్తి చేశామన్నారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.