Jagdish Reddy: విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర
ABN , Publish Date - Jun 30 , 2024 | 05:13 PM
విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagdish Reddy) అన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రైవేట్ పరం చేయడంలో మొదటి మెట్టు అని చెప్పారు.
హైదరాబాద్: విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagdish Reddy) అన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రైవేట్ పరం చేయడంలో మొదటి మెట్టు అని చెప్పారు. ఈరోజు(ఆదివారం) తెలంగాణ భవన్‌లో జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే రైతులకు ఉచిత కరెంటు పోతుందని తెలిపారు.
మోటార్లకు మీటర్లు బిగిస్తారని ఇది రైతుల మెడకు ఉరిబిగించే చర్య అని విమర్శించారు. ఓల్డ్ సిటీలో బిల్లుల వసూళ్ల పేరిట ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఓల్డ్ సిటీలో బిల్లులు వసూళ్లు కావడం లేదని చెప్పడం అక్కడి ప్రజలను అవమానించడమేనని అన్నారు. విద్యుత్ రంగాన్ని అదానీ కంపెనీకి అప్పగించడానికి రంగం సిద్ధమైందని ఆరోపించారు. ఒడిశాలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఇబ్బందులొచ్చాయని అన్నారు. పేద ప్రజలపై విద్యుత్ బిల్లులు కట్టలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.