Kadiam Srihari: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది
ABN , Publish Date - Jan 10 , 2024 | 09:07 PM
చిన్న, చిన్న లోపాలతోనే బీఆర్ఎస్ ( BRS ) అధికారం కోల్పోయిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) తెలిపారు. బుధవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బూత్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ స్థాయి వరకు సమన్వయం ఉండాలని కడియం శ్రీహరి తెలిపారు.
హైదరాబాద్: చిన్న, చిన్న లోపాలతోనే బీఆర్ఎస్ ( BRS ) అధికారం కోల్పోయిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) తెలిపారు. బుధవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘బూత్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ స్థాయి వరకు సమన్వయం ఉండాలి. యూనివర్సిటీల్లో పార్టీ కార్యక్రమాలు ఉండాలని మా దృష్టికి వచ్చింది. బీఆర్ఎస్ తెచ్చిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది. కర్ణాటకలో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నామని సీఎం సిద్దరామయ్య ఆర్ధిక సలహాదారు చెప్పారు. తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో సీఎం, డిప్యూటీ సీఎం స్పష్టంగా చెప్పడం లేదు’’ అని కడియం శ్రీహరి అన్నారు.
ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది
‘‘ఎన్నికల కంటే ముందు సీఎం రేవంత్‌రెడ్డి పథకాల అమలు తేదీలను ప్రకటించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుపై ప్రభుత్వం వైఖరిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి. గృహలక్ష్మీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. పార్టీ సమావేశాలను MCHRDలో సీఎం రేవంత్ రెడ్డి ఎలా పెడతారు. ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయించాలి. ప్రగతి భవన్‌లో రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారని నాడు రేవంత్‌రెడ్డి గగ్గోలు పెట్టలేదా..?కేవలం ఓడిపోయిన నియోజకవర్గ ఇన్‌చార్జిలకు మాత్రమే అభివృద్ధి పనులు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్‌లో జరిగితే ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చని భావించాము. ఒప్పందంలో ఏమైనా తప్పులు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలి. 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. 1994 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు’’ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.