Share News

CM Revanth: అందుకే దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:30 PM

వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేబోతున్నామని ప్రకటించారు.

CM Revanth: అందుకే దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది

హైదరాబాద్: వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేబోతున్నామని ప్రకటించారు. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకువచ్చి.. వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని సీఎం వ్యాఖ్యానించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. గురువారం నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.


నైపుణ్యం ఉన్నవారి కొరత ఉంది..

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారని వివరించారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి ఆనాడు రాజీవ్ గాంధీ పునాదులు వేశారని గుర్తుచేశారు. ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మన విధానాల్లో కూడా ఆ మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.


ALSO Read: CM Revanth: కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్

17 కోర్సులను ప్రవేశపెట్టబోతున్నాం

‘‘యంగ్ ఇండియా పత్రిక మహాత్మాగాంధీ మొదలు పెట్టారు. మహాత్మాగాంధీ స్పూర్తితో యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పించడమే స్కిల్స్ యూనివర్సిటీ ఉద్దేశం. స్కిల్స్ యూనివర్సిటీపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు సూచనలు ఇస్తే సంతోషించేవాళ్లం. కానీ వారు సభకు రాలేదు.. వచ్చిన వారు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. స్కిల్స్ యూనివర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టబోతున్నాం. స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఏడాదికి రూ.50వేలు నామమాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నాం. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉచితంగా అందిస్తాం. ఈరోజు సాయంత్రం స్కిల్స్ యూనివర్సిటీకి భూమిపూజ చేసుకోబోతున్నాం. ఈ సంవత్సరం 6కోర్సులకు రెండువేల మందికి అడ్మిషన్స్‌కు అవకాశం ఇస్తున్నాం. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. భవిష్యత్‌లో జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth: వర్గీకరణపై సుప్రీం తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ఏమన్నారంటే?

TG Assembly Sessions: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2024 | 04:30 PM