Share News

Kishan Reddy: ఒడిశా ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:15 PM

ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు.

 Kishan Reddy: ఒడిశా ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kishan Reddy

హైదరాబాద్: ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. సింగరేణి సంస్థకు కేటాయించిన ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల నైని బ్లాక్‌కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేడు(శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు. అటవీ అనుమతుల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైందని అన్నారు. 2015లోనే సింగరేణికి ఈ నైని బ్లాక్ కేటాయింపు జరిగినప్పటికీ.. వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఉత్పత్తి సాధ్యం కాలేదని గుర్తుచేశారు.


కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నైని బ్లాక్‌కు సంబంధించి ఒడిశా ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో నైని బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన అవసరం, సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు విడుదల చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని అన్నారు. ఒడిశా ముఖ్య మంత్రి శ్రీ మోహన్ మాంఝీకి ధన్యవాదములు తెలిపారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వేగవతంగా నిర్ణయం తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. నైని బ్లాక్ లో సింగరేణి ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత.. తెలంగాణలో పవర్ సెక్యూరిటీకి (విద్యుత్ భద్రత) మరింత ఊతం లభిస్తుందనే విశ్వాసం తనకుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 10:29 PM