TS Politics: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ.. చర్చనీయాంశమైన తమిళిసై..!!
ABN , Publish Date - Jan 25 , 2024 | 04:17 PM
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలంగాణ జనసమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram), సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్(Mir Amir Ali Khan)లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలంగాణ జనసమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram), సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్ (Mir Amir Ali Khan) లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కోదండరాంను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు కోదండరాం మద్దతిచ్చారు. ఆయనకు ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్‌కు పంపించారు.
నాడు.. నేడు..!
కాగా.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. అయితే గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వీరిద్దరిని పెండింగ్‌లో పెట్టారు. వారిని ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నామినేట్ చేశారో చెప్పాలని గవర్నర్ గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం వారిద్దరి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ పేర్లను అమోదించడంతో తమిళిసై మరోసారి చర్చానీయాంశం అయ్యారు.