KTR: చిల్లర పనులు, కేసులకు భయపడం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ మాస్ వార్నింగ్
ABN , Publish Date - Oct 27 , 2024 | 09:15 PM
రాజకీయంగా తమను ఎదుర్కొలేకపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీాఆర్ అన్నారు. తమ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేటీఆర్ స్పందించారు. దావత్ చేసుకుంటే తప్పా అని ప్రశ్నించారు. నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరుస వైఫల్యాలు చెందిందని విమర్శించారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 11 నెలల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. 11 నెలల కాంగ్రెస్ వైఫల్యాలను బయటపెడుతున్నామని చెప్పారు. రాజకీయంగా తమను ఎదుర్కొలేకపోతున్నారని అన్నారు. తమ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
పార్టీలో డ్రగ్స్ దొరకలేదు..
‘‘కుట్రలతో మా గొంతు నొక్కుతున్నారు. మా కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్నారు. కుట్రలతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..చిల్లర పనులు, కేసులకు భయపడం. అది ఫామ్‌హౌస్ మా బావమరిది రాజ్ పాకాల ఇల్లు. పార్టీలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అది ఫ్యామిలీ ఫంక్షన్ మాత్రమే. గృహ ప్రవేశం సందర్భంగా జరిగిన ఫంక్షన్. పార్టీలో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. దావత్లో 13 మందికి నెగిటివ్ వస్తే ఒకరికే పాజిటివ్ వచ్చిందంట. ఆ వ్యక్తి ఎక్కడ డ్రగ్ తీసుకున్నారో విచారించాలి. సోదాల పేరుతో ఇబ్బందులు పెడితే ఊరుకోం. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా ఎలా మారింది. డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడబలుక్కుని మాట్లాడుతున్నాయి. నా బావమరిదికి డ్రగ్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. నేను వెనక్కి తగ్గేది లేదు.. కాంగ్రెస్‌ను నిలదీస్తూనే ఉంటాం. చేతనైతే రాజకీయంగా తలపడండి. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టండి’’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమృత్ టెండర్లపై పోరాటం చేస్తాం...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుస వైఫల్యాలు,ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలం. సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్థికి కట్టబెట్టిన అమృత్ టెండర్లు,సివిల్ సప్లైస్ స్కామ్ పై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ధీరోదాత్తంగా పోరాటం చేస్తున్నారు. మాకు సమాధానం చెప్పే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొలేక మా కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి కుట్రలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మేము చావుకు తెగించి ఉద్యమంలోకి వచ్చాం.11 గంటల నుంచి ఎపిసోడ్ నడుపుతున్నారు. దీపావళికి ఒక ఇంట్లో దావత్ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి అంట. మా బామ్మర్ధి రాజ్ పాకాల జన్వడ రిజర్వ్ కాలనీలో కొత్త ఇళ్లు కట్టుకున్నారు’’ అని కేటీఆర్ వెల్లడించారు.
అసత్య ప్రచారం చేస్తున్నారు...
‘‘రేవ్ పార్టీ అని అసత్య ప్రచారం చేస్తున్నారు. రేవ్ పార్టీ అర్ధం తెలుసా. ఆ పార్టీలో మా బామ్మర్ధి అమ్మ, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నది పురుషులు,మహిళలు కాదు. భార్యా,భర్తలు ఆ పార్టీలో ఉన్నారు. చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టారు. అక్కడ డ్రగ్స్ లేవని ఇన్స్పెక్టర్ చెప్పారు. డ్రగ్స్ దొరకకుండా కేసులు ఎలా పెడతారు.నన్ను,మా పార్టీని ఎదుర్కొలేక మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. బాంబులు అంటే ఏదో అనుకున్నా. నేను అక్కడే ఉన్నానని కొన్ని ప్రసార మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను నిన్న మా పార్టీ అధినేతను కలిసి వచ్చాను. నాపైన, నా భార్యపైన, కుటుంబ సభ్యులపైన ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయవచ్చా. మీరు జైళ్లకు పంపినా, ఎక్కడికి పంపినా ఉద్యమ బాటలో నడుస్తాం.రాష్ట్రంలో పోలీసులు పోలీసులను కొడుతున్న పరిస్థితిని చూస్తున్నాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.