KTR: హైడ్రాకు కేటీఆర్ సవాల్.. దమ్ముంటే అతని ఇళ్లు కూల్చండి: కేటీఆర్..
ABN , Publish Date - Sep 30 , 2024 | 08:53 PM
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తెలంగాణ ప్రభుత్వం ఖాళీ చేయిస్తుందన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్ గూడలో పర్యటించిన కేటీఆర్.. బాధితుల దగ్గరకు స్వయంగా వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తెలంగాణ ప్రభుత్వం ఖాళీ చేయిస్తుందన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్ గూడలో పర్యటించిన కేటీఆర్.. బాధితుల దగ్గరకు స్వయంగా వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అత్తాపూర్‌లోని కిషన్ బాగ్ ప్రాంతంలో ప్రజలతో భేటీ అయ్యారు. మూసీ అభివృద్ధి అంటూ హైడ్రా తమ ఇళ్లను కూల్చివేస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి ఒంటెద్దు పోకడలకు దిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
సీఎంగా అన్‌ఫిట్..
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.." ఇళ్లు నిర్మించేందుకు కాంగ్రెస్ నేతలే పర్మిషన్ ఇచ్చి, వాళ్లే రిజిస్ట్రేషన్ చేసి, ఇప్పుడు వాళ్లే కూలగొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియటం లేదు. రేవంత్ రెడ్డి ఒక అన్ ఫిట్, అసమర్థ ముఖ్యమంత్రి. ఇక్కడ మార్కింగ్ ఇచ్చిన బిల్డింగ్‌లకు సంబంధించి విలువ లెక్కిస్తే దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ ప్రజల ఆస్తి ఉంటుంది. 2,400 కిలోమీటర్లు ఉన్న నమామీ గంగే ప్రాజెక్టు కోసం రూ.40వేల కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది 55కిలోమీటర్ల ఉన్న మూసీకి రూ.1.50లక్షల కోట్లు ఖర్చు పెడతారంట. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా?. స్టాంప్ పేపర్లు, అఫిడవిట్లు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మరీ హామీలు ఇచ్చారు.
ఢిల్లీకి ముడుపులు..
ఢిల్లీ కాంగ్రెస్‌కు రూ.25వేల కోట్లు పంపటానికే ఈ లక్షా 50వేల కోట్లు ప్రాజెక్టు చేపట్టారు. కాంగ్రెస్ బుల్డోజర్లకు అడ్డుగా మేముంటాం. ధైర్యం కోల్పోకండి. హైదరాబాద్‌లో లక్షల మంది ప్రజలు ఇళ్ల కోసం ఆందోళన చెందుతున్నారు. నగరంలో ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి కక్ష పెట్టుకుని కుట్ర చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో "బుల్డోజర్ రాజ్ నహీ ఛలే"గా అని రాహుల్ గాంధీ అంటారు. మరి తెలంగాణలో వారి అయ్య జాగీరా బుల్డోజర్ రాజ్ నడిపించేందుకు?. సోషల్ మీడియాలో రేవంత్‌ను తిడుతున్న తిట్లు చూస్తుంటే మనిషి అనేవాడు ఎప్పుడో సచ్చిపోయేవాడు. సీఎం సొంత ఇళ్లు చెరువు కుంటలోనే ఉంది. దుర్గం చెరువులోనే వాళ్ల అన్న ఇళ్లు కూడా ఉంది. అవి కూలగొట్టరంట. పేదల గృహాలే కూల్చుతారంట. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలందరి నివాసాలు హిమాయత్ సాగర్ చుట్టూ ఉన్నాయి.
ఇల్లు అంటే సెంటిమెంట్..
పేద, మధ్య తరగతి ప్రజలకు ఇల్లు అనేది ఒక ఎమోషన్. అలాంటి వారి గృహాలను కూలగొడితే వారి ఆశలను కూలగొట్టినట్లే. హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా మూసీతో సంబంధం లేదని ప్రకటన చేశారు. మరి ఎందుకు మార్కింగ్ చేశారు. 18వేల ఇళ్లు అంటున్నారు. ఏ ఒక్కరిదీ కూల్చనివ్వం. రూ.5వేలు ఇస్తే మాట్లాడుతున్నారని సిగ్గు లేకుండా ఓ మంత్రి అంటున్నారు. అవసరమైతే బయట నుంచీ ప్రజలను తీసుకొచ్చి బాధితులకు అండగా మేము నిలబడతాం. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ముందు ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించు. రేవంత్ రెడ్డి అన్నకు నాలుగు బెడ్ల రూమ్‌ల ఇల్లు ఇద్దాం. ఆయన మారతాడేమో చూద్దాం. రైతుల శక్తి ముందు ప్రధాని మోదీ ప్రభుత్వమే మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. మీరు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు" అని భరోసా ఇచ్చారు.