Share News

Minister Seethakka: పుష్ప సినిమాపై సీతక్క హాట్ కామెంట్స్

ABN , Publish Date - Dec 23 , 2024 | 05:10 PM

హీరో అల్లు అర్జున్‌తోపాటు టాలీవుడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం లేదన్నారు. అయినా అల్లు అర్జున్, సినిమా ఇండస్ట్రీతో తమకు వైరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.

Minister Seethakka: పుష్ప సినిమాపై సీతక్క హాట్ కామెంట్స్

ములుగు, డిసెంబర్ 23: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా వివాదంపై తెలంగాణ మంత్రి సీతక్క సోమవారం ములుగులో సంచలన వ్యాఖ్యలు చేశారు. జై బీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చిత్రాలకు ప్రోత్సాహాకాలు సైతం లేవన్నారు. కానీ ఒక స్మగ్లర్.. పోలీస్ దుస్తులు విప్పి నిలబెట్టి.. పోలీస్‌స్టేషన్ కొన్న సినిమాలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతమన్నారు. స్మగ్లర్ హీరో అంటే అదేం సినిమా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. స్మగ్లర్ హీరో.. స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్.. విలన్ ఎలా అవుతాడని మంత్రి సీతక్క సందేహం వ్యక్తం చేశారు.

Also Read: Yearender 2024: ఢిల్లీ మద్యం కుంభకోణం.. రాజకీయ ప్రకంపనలు


అయితే సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రజలు స్వాగతిస్తారని ఆమె స్పష్టం చేశారు. రెండు హత్యలు చేసిన నేరస్థుడు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా చూస్తూ దొరికిపోయాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మతాలు, కులాలు ముఖ్యం కాదని.. మనిషికి ఉండవలసింది మానవత్వమని సీతక్క స్పష్టం చేశారు. మానవత్వం ఉన్న సినిమాలకు ప్రోత్సాహం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆమె సూచించారు. చంకలో బిడ్డ పెట్టుకుని ఒక పేద మహిళపై హక్కులు కోసం పోరాడిన జై బీమ్ సినిమాకు అవార్డు సైతం రాలేదన్నారు. అయితే సినిమాలను మాత్రం తాము గౌరవిస్తామని చెప్పారు.

Also Read : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..


మరోవైపు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్‌తోపాటు టాలీవుడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం లేదన్నారు. అయినా అల్లు అర్జున్, సినిమా ఇండస్ట్రీతో తమకు వైరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా హాల్‌కు హీరో, హీరోయిన్ రావడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. సామాన్యులకు ఇబ్బంది ఎదురవుతోందనే స్పెషల్ షోలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.


హ్యూమిలేట్ చేస్తున్నారంటూ అల్లు అర్జున్ చెప్పడం తప్పు అని పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం అల్లు అర్జున్ చేశారని వివరించారు. అయినా ఒక మహిళ ప్రాణాలు పోతే ప్రతిపక్షాలకి బాధ్యత ఉండదా? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ నివాసంపై ఎవరో దాడి చేశారని.. కానీ ఆ పని కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ కండువాతో కేటీఆర్ తో ఫోటోలు దిగారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. టాలీవుడ్‌లో అన్ని సమస్యలు దిల్ రాజుకు తెలుసునన్నారు. అందుకే ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించామని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు.


ఫిల్మ్‌నగర్‌ని నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీనేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి అయినా చనిపోయిన కుటుంబానికి ఇప్పించారా? అంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్, పురందేశ్వరిలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో మహిళా చనిపోతే నాయకురాలైన పురంధేశ్వరి కనీసం బాధితురాలి కోసం స్పందించ లేదన్నారు. తాము ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగమని ఎంపీ స్పష్టం చేశారు. అయితే ఇమేజ్ పెంచుకోవడానికే కొందరు అల్లు అర్జున్ అంశంపై మాట్లాడుతున్నారంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. బీజేపీ హాయాంలో అనేక చోట్ల తొక్కిసలాటలు జరిగాయని ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.

For Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 05:17 PM