Share News

Harish Rao: జాబ్ క్యాలెండర్ పెద్ద జోక్ క్యాలెండర్: మాజీ మంత్రి హరీశ్ రావు

ABN , Publish Date - Aug 03 , 2024 | 07:06 AM

జాబ్ క్యాలెండర్ ఒక పెద్ద జోక్ క్యాలెండర్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. బోగస్ ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Harish Rao: జాబ్ క్యాలెండర్ పెద్ద జోక్ క్యాలెండర్: మాజీ మంత్రి హరీశ్ రావు
Siddipet MLA Tanniru Harish Rao

హైదరాబాద్: జాబ్ క్యాలెండర్ ఒక పెద్ద జోక్ క్యాలెండర్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. బోగస్ ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామగ్రామాలు తిప్పారని, గెలిచిన మెుదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టారని మండిపడ్డారు. గద్దెనెక్కిన తర్వాత వారిని మరచిపోయారన్నారు. మొదటి క్యాబినెట్‌లోనే జాబ్ క్యాలెండర్ అన్నారు. అధికారం చేపట్టిన 8నెలల తర్వాత ఇచ్చిన దాంట్లోనూ ఎన్ని ఉద్యోగాలో చెప్పకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే ఎవరు ఇచ్చారనేది ఉంటుంది. అయితే జాబ్ క్యాలెండర్‌పై పేరు, సంతకం రెండూ లేవు. ఒక చిత్తు కాగితం లాగా ప్రకటించారు. చర్చ కూడా లేకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాన్ని చదివి సభ నుంచి పారిపోయారు. లక్షలాది మంది యువతీయువకుల కంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా?. చర్చ చేయమంటే ఎందుకు పారిపోయారో చెప్పాలి. ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సభలో మైక్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేయించారు. మీకు మాట్లాడే ముఖం లేదా?. మిమ్మల్ని వదిలిపెట్టం నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. అభయ హస్తం మ్యానిఫెస్టోలో చెప్పినవి ఒక్కటీ అమలు చేయలేదు. రెండు లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. రేవంత్ రెడ్డి గన్‌మెన్ లేకుండా అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. మీరు ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే దమ్ముంటే రావాలి. మీరు ఏ టైమ్, డేట్ చెప్పినా నేను వస్తా.


సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు దాక్కుంటారు, ఎన్ని రోజులు తప్పించుకుంటారు. యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ అయినా నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి. లేకుంటే వారితో కలిసి ఏఐసీసీ కార్యాలయానికి వస్తాం. అక్కడే నిలదీస్తాం. హామీలు ఇచ్చి వెళ్లిపోయారు. ప్రతిపక్షాలకు కనీసం మైక్ ఇవ్వడం లేదు. ప్రజా ప్రభుత్వంలో అన్నీ ఆంక్షలే. ఉద్యోగాల గురించి అడిగితే కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. శాసనసభ చరిత్రలో శుక్రవారం అనేది ఒక బ్లాక్ డే. శాసనసభ కౌరవ సభగా మారింది. మహిళలు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఇది ఉద్యమాల గడ్డ, దబాయింపులకు తావు లేదు. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాకా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామకపత్రాలు ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా దమ్ముంటే సమాధానం చెప్పాలని" డిమాండ్ చేశారు.

Updated Date - Aug 03 , 2024 | 07:06 AM