Share News

MLC Mahesh: వారిద్దరూ తెలంగాణకు అన్యాయం చేశారు

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:10 PM

ఏపీ సీఎం జగన్‌(CM Jagan)తో కుమ్మకై తెలంగాణ నీటిని మాజీ సీఎం కేసీఆర్(KCR) ఏపీకి ధారాదత్తం చేశారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు.

MLC Mahesh: వారిద్దరూ తెలంగాణకు అన్యాయం చేశారు

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్‌(CM Jagan)తో కుమ్మకై తెలంగాణ నీటిని మాజీ సీఎం కేసీఆర్(KCR) ఏపీకి ధారాదత్తం చేశారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... నీళ్ల విషయంలో తెలంగాణకు ఏపీలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అని చెప్పారు. కృష్ణా జలాలపై జరుగుతున్న ప్రచారాన్ని రేపు(సోమవారం) అసెంబ్లీలో తిప్పి కొడతామని హెచ్చరించారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ నాయకులు అన్ని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు కేసీఆర్ లూటీ చేశారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

తెలంగాణ ప్రజలకు నిజాలు చెబుతాం: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

కృష్ణా జలాలపై రేపు(సోమవారం) అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య (Birla Ilaiah) అన్నారు. అసెంబ్లీలో తమ ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. ఎల్లుండి కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపు తెలంగాణ ప్రజలకు నిజాలు చెబుతామని అన్నారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని మండిపడ్డారు. సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. ఏపీకి నీళ్ల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ సహాయం చేశారని ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ టీమ్‌కి అసెంబ్లీలో బుద్ది చెబుతామని హెచ్చరించారు. సెంటిమెంట్ రగిల్చి ఓట్లు కొల్లగొట్టడంలో కేసీఆర్ దిట్ట అని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం పోలింగ్ రోజు డ్రామాలు చేశారని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నిధులు దోచుకొని మొన్నటి అసెంబ్లీ, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు వాడటానికి ప్లాన్ చేసుకున్నారని బీర్ల అయిలయ్య ఆరోపించారు.

జగన్, కేసీఆర్ కలిసి నాటకాలు ఆడారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

తెలంగాణకు ఉమ్మడి పాలకులు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) అన్నారు. జగన్ కేసీఆర్ మాట్లాడుకున్న తర్వాతే నాగార్జున సాగర్ పైకి పోలీసులు వచ్చారని తెలిపారు. జగన్, కేసీఆర్ కలిసి నాటకాలు ఆడారని చెప్పారు. కేసీఆర్ చేసిన పనుల వల్ల దక్షిణ తెలంగాణా భవిష్యత్తులో ఎడారిగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎన్నికల్లో లబ్ధి కొరకే కేసీఆర్ కృష్ణా జలాలపై పోరాటం అంటూ డ్రామా మొదలు పెట్టారని ఆది శ్రీనివాస్ విమర్శించారు.

Updated Date - Feb 11 , 2024 | 10:11 PM