Share News

Raksha Bandhan: కేటీఆర్‌కు రాఖీ కట్టడంపై మహిళా కమిషన్ సీరియస్..

ABN , Publish Date - Aug 24 , 2024 | 09:55 PM

విచారణకు పిలిచి మహిళా కమిషన్ కార్యాలయం లోపల సభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు రాఖీ కట్టడంపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది.

Raksha Bandhan: కేటీఆర్‌కు రాఖీ కట్టడంపై మహిళా కమిషన్ సీరియస్..

హైదరాబాద్: విచారణకు పిలిచి మహిళా కమిషన్ కార్యాలయం లోపల సభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు రాఖీ కట్టడంపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులకు నోటీసులు జారీ చేయాల్సిందిగా సెక్రటరీని కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద(Nerella Sharada) ఆదేశించారు. విచారణకు హాజరైన వ్యక్తికి రాఖీ కట్టడంపై ఆమె సీరియస్ అయ్యారు.


తెలంగాణలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. రాజకీయంగా పెద్ద రచ్చ జరగడం, పెద్దఎత్తున మహిళలు నిరసన తెలిపారు. దీంతో కేటీఆర్ క్షమాపణలు చెప్పారు. ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ(శనివారం) కేటీఆర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవేనని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని కేటీఆర్ వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. తెలంగాణలో మహిళలపై ఇటీవల జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.


అయితే విచారణ అనంతరం మహిళా కమిషన్ సభ్యులు పోటీలు పడి మరీ కేటీఆర్‌కు రాఖీలు కట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో నేరెళ్ల శారద తీవ్రంగా స్పందించారు. కమిషన్ ప్రాంగణంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ సభ్యులను ఆమె హెచ్చరించారు. కమిషన్ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ అనుమతి లేకపోయినా సీక్రెట్‌గా తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలను చిత్రీకరించడంపై ఆమె సీరియస్ అయ్యారు. మహిళా కమిషన్ విశ్వసనీయత దెబ్బతీసే విధంగా సభ్యుల ప్రవర్తించవద్దని ఉందంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాఖీ కట్టిన ఆరుగురు సభ్యులకు నోటీసులు ఇవ్వడంతోపాటు న్యాయ సలహా తీసుకుంటున్నారు. లీగల్ ఒపీనియన్ తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 24 , 2024 | 10:07 PM