Allu Arjun: అల్లుడు ఎలా ఉన్నావ్.. బన్నితో మెగాస్టార్
ABN , Publish Date - Dec 15 , 2024 | 11:54 AM
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఈరోజు వెళ్లారు. వీళ్లిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.‘ అల్లుడు ఎలా ఉన్నావ్’ అంటూ చింరజీవి పరామర్శించారు.
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది. ఈ కేసు విషయంలో అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి చంచల్‌గౌడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జైల్లోనే బన్నిని ఉంచి మరుసటి రోజు శనివారం విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బన్నిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో బన్ని ఇంటికి చిరంజీవి వెళ్లి పరామర్శించారు. ఇవాళ(ఆదివారం) చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్‌తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. ఎలా ఉన్నావ్ అల్లుడు అంటూ చిరంజీవి మందలించారు.
13 గంటలు జైల్లో..
అల్లు అర్జున్ 13 గంటలు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అరెస్టయిన రోజు రాత్రి జైలు క్యాంటిన్‌లో వండిన ఎగ్‌ఫ్రైడ్ రైస్ తిన్నారు. రాత్రిపూట చలితో ఇబ్బందిపడ్డారు. చాలాసేపు మెలకువగానే ఉన్న ఆయన, అర్ధరాత్రి తర్వాత నిద్రపోయారు. ఎక్స్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి కేసులో శుక్రవారం అరెస్టయి రిమాండ్ ఖైదీగా సాయంత్రం 5:30 గంటలకు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. శనివారం ఉదయం 6:30 గంటలకు మధ్యంతర బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. అల్లు అర్జున్ అరెస్టయిన గంటలోనే హై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. బెయిల్ పత్రాలు సమయానికి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో విడుదల జాప్యమైంది. జైల్లో అల్లు అర్జున్‌ను అధికారులు అండర్ ట్రైయల్ ఖైదీ నంబర్ 7697 కేటాయించి మంజీరా బ్యారక్‌లో గట్టి బందోబస్తు మధ్య ఉంచారు. జైలు అధికారులు అల్లు అర్జున్‌కు తొలుత చాయ్, బిస్కెట్లు ఇచ్చారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్న సమాచారం మేరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పెషల్ కేటగిరి సదుపాయాలు కల్పించాల్సి ఉండటంతో ఆయనకు ఒక బెడ్, కుర్చీ ఏర్పాటు చేశారు.
ఎగ్‌ఫ్రైడ్ రైస్ తిన్నఅల్లు అర్జున్ ..
రాత్రి ఎగ్‌ఫ్రైడ్ రైస్ తిన్నారు. వాస్తవానికి డిన్నర్ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఏదైనా తినాలి కదా. బయట నుంచైనా భోజనం తెప్పించుకుంటారా. అని జైలు అధికారులు ఆయన్ను అడిగినట్లు తెలిసింది. దీనికి అల్లు అర్జున్.. ఇక్కడే ఏదైనా దొరుకుతుందా.. అని అడగడంతో క్యాంటిన్‌లో ఎగ్ ఫ్రైడ్‌రైస్ చేయిస్తామని అధికారులు చెప్పారు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉండటంతో అధికారులు అల్లు అర్జున్‌కు కొత్త రగ్గు, దుప్పట్లను అందజేశారు. అర్ధరాత్రి చాలాసేపటి వరకు మెలకువగా ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత తనకు కేటాయించిన బెడ్‌పై నిద్రపోయారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ఆయన్ను జైలు సిబ్బంది నిద్రలేపి విడుదలకు సిద్ధం చేసినట్లు తెలిసింది. విడుదల సమయంలో ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి జైలు వద్దకు చేరుకున్నారు. ఉదయం 6.30 గంటలకు అల్లు అర్జున్ జైలు బయటకువచ్చారు. ఈ సందర్భంగా జైలు సిబ్బంది ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెక్యూరిటీ కారణంగా పోలీసుల ఆదేశాలతో అల్లు అర్జున్‌ను జైలు వెనుక మార్గం నుంచి పంపించారు. అక్కడి నుంచి తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి ఆయన వెళ్లిపోయారు. ఇదే కేసులో అరెస్టు అయిన నిందితుల్లో ఇద్దరు.. థియేటర్ పార్టనర్స్ అగమాటి పెద్ద రామారెడ్డి, ఆగమాటి చిన్న రామారెడ్డికి బెయిల్ మంజూరైంది.
చట్టాన్ని గౌరవిస్తాను: అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తన ప్రమేయం లేదని, 20 ఏళ్ల నుంచి ప్రేక్షకులతో కలిసి ఆ థియేటర్‌లో సినిమా చూస్తున్నానని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. థియేటర్‌లో మహిళ మృతిచెందడం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, అది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని, త్వరలోనే ఆ కుటుంబసభ్యులను పరామర్శిస్తానని చెప్పారు. తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన అభిమానులు, సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మహిళ మృతి ఘటనలో తన కుమారుడికి సంబంధం లేదని, ఆ ఘటన దురదృష్టకరం అని అల్లు అరవింద్ అన్నారు. బన్నీని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.