TS Govt: దూకుడు పెంచిన సర్కార్.. పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయం ...
ABN , Publish Date - Nov 28 , 2024 | 07:53 PM
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతోంది.
హైదరాబాద్: పంచాయితీ ఎన్నికల కోసం రేవంత్ ప్రభుత్వం తుది కసరత్తు చేస్తుంది. జనవరి 14న పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మూడు ఫేజుల్లో పంచాయితీ ఎన్నికలు జరిగనున్నాయి. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఎంపీటీసీలతో ఎంపీపీలున్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను ఐదుకు పెంచాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. వచ్చే పంచాయితీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఆ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు పెట్టనుంది.
కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు..
కాగా.. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో కుల గణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చెప్పారు. దీనికి అనుగుణంగానే కుల గణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న కమిషన్ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కొత్త కమిషన్ చైర్మన్, సభ్యులపై సీఎం రేవంత్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
త్వరలో కొత్త కమిషన్..
త్వరలో కొత్త కమిషన్‌ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల మీడియాతో చెప్పారు. దీంతో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. కాగా బీసీ కమిషన్ ఏర్పాటైన వెంటనే యుద్ధ ప్రాతిపదిక కుల గణన చేపడుతుంది. కుల గణనకు అవసరమైన విధివిధానాలు, నమూనాలు, పద్ధతులు, సర్వే ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కుల గణనపై సమాచారాన్ని కూడా తెప్పించుకున్నారు. బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన కుల గణనపై అధ్యయనం చేశారు.
కుల గణనకు అవసరమైన నిధుల్ని సమకూర్చాలని ఆర్థిక శాఖకు సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిధుల కేటాయింపునకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన పనిలో తానుంది. వార్డుల వారిగా ఓటర్ల వివరాలు తెప్పించే పని మొదలుపెట్టింది. గురువారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలిచ్చారు.
కుల గణనకు ఎంత కాలం?
కుల గణనకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రక్రియను పరిశీలిస్తే.. తెలంగాణలో రెండు నుంచి ఆరు నెలల సమయంలో కుల గణన పూర్తి చేయవచ్చు. అయితే యుద్ధప్రాతిపదికన చేపడితే రెండు నెలల్లో పూర్తి చేయవచ్చుననే ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ కసరత్తునంతా బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరగాలి.
అప్పుడే దానికి చట్టబద్ధత ఉంటుంది. కొత్తగా కమిషన్ ఏర్పాటు అయిన వెంటనే గణన చేపడితే ప్రక్రియ రెండు నెలల్లోపు పూర్తవుతుంది. వచ్చిన డేటాను క్షేత్రస్థాయి పరిశీలన చేసి, దాన్ని విశ్లేషించే కసరత్తు కమిషన్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత రిజర్వేషన్ల శాతంపై కమిషన్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ లెక్కన సెప్టెంబరులో కమిషన్ ఏర్పాటయితే కుల గణనకు నవంబరు వరకు సమయం తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఒకటి రెండు నెలల్లో వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి రిజర్వేషన్లపై తుది అంచనాకు రావొచ్చు.
15 రోజుల ముందుగా షెడ్యూల్..
డిసెంబరు, జనవరి మొదటి వారంలో ఇదంతా పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలకు 15 రోజుల ముందుగా షెడ్యూల్ వెలువడుతుంది. ఈ లెక్కన జనవరి నెల చివరి వరకు రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు నెలల్లో ఈ ప్రక్రియ ను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తే.. కాంగ్రె్‌సకు ప్రజల నుంచి సానుకూలత ఉంటుందని, ఆ దిశగా ముందుకెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.