Share News

Niranjan Reddy: పాలమూరు - రంగారెడ్డి పనులను వెంటనే పూర్తి చేయాలి

ABN , Publish Date - Sep 06 , 2024 | 10:15 PM

ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పడావు పెడతారా ? అని నిలదీశారు. తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన పనులను వెంటనే చేపట్టాలని కోరారు.

Niranjan Reddy: పాలమూరు - రంగారెడ్డి పనులను వెంటనే పూర్తి చేయాలి

వనపర్తి జిల్లా: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పడావు పెడతారా..? అని నిలదీశారు. తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన పనులను వెంటనే చేపట్టాలని కోరారు. ఈరోజు(శుక్రవారం) వనపర్తి జిల్లాలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్‎రెడ్డి సీఎంగా ఉన్నా 9 నెలల్లో ఒక్కసారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు.


సాగునీటి శాఖా మంత్రి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని చెప్పారు. ఈ ఏడాది జూరాలకు భారీ వరద వచ్చిందని అన్నారు. అత్యధికంగా 3.88 లక్షల ఇన్ ఫ్లో ఉందని చెప్పారు. 50 రోజుల్లో 732 టీఎంసీల వరద వచ్చిందని తెలిపారు. ఇక్కడ వడిసిపట్టింది 22 టీఎంసీలు మాత్రమేనని అన్నారు. శ్రీశైలం, సాగర్ తర్వాత మిగతా నీరు సముద్రం పాలు అయిందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు.


కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్వకుర్తి ఎత్తిపోతల కింద నిర్మించాల్సిన రిజర్వాయర్లను ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టారని మండిపడ్డారు. అధికారం దక్కిన వెంటనే పాత టెండర్లు రద్దు చేసి పాలమూరు రంగారెడ్డిని ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టారని చెప్పారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేక వట్టెం పంప్ హౌస్ వరదలకు నీట మునిగిందని తెలిపారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా కృష్ణాలో నీళ్లున్నా రిజర్వాయర్లను నింపుకునే పరిస్థితి లేదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - Sep 06 , 2024 | 10:27 PM